గ్రూప్ -1పై హైకోర్టు తీర్పు రిజర్వ్
ఈనెల 21న నుంచి మెయిన్స్ పరీక్షల నేపథ్యంలో తీర్పు ఎలా ఉంటుందా అని ఆసక్తి
గ్రూప్ -1 ప్రిలిమ్స్ పై దాఖలైన పిటిషన్ లపై హైకోర్టు విచారణ ముగించింది. ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫైనల్ కీ, రీ నోటిఫికేషన్, ఎస్టీ రిజర్వేషన్ల పెంపును సవాల్ చేస్తూ రెండు వేర్వేరు పిటిషన్‌లు దాఖలు చేశారు. పిటిషనర్లు లేవనెత్తిన అభ్యంతరాలు, వాటిపై టీజీపీఎస్సీ వాదనలు విన్న హైకోర్టు తీర్పు రిజర్వ్ లో పెట్టింది. ఫైనల్ కీలో తప్పుడు ప్రశ్నలు తొలగించి మెరిట్ జాబితాలు విడుదల చేయాలని పిటిషనర్లు వాదించగా, సబ్జెక్ట్ ఎక్స్‌పర్ట్స్ కమిటీ ఫైనల్ చేసిన తర్వాతే తుది కీ విడుదల చేశామని టీజీపీఎస్సీ వాదించింది. గ్రూప్ -1కు వ్యతిరేకంగా దాఖలు చేసిన పిటిషన్లను కొట్టేయాలని టీజీపీఎస్పీ విజ్ఞప్తి చేసింది. ఈనెల 21 నుంచి గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు నిర్వహించనున్న నేపథ్యంలో హైకోర్టు ఎలాంటి తీర్పు ఇవ్వబోతుందన్నది ఆసక్తికరంగా మారింది.