కేటీఆర్ వెంట విచారణకు అడ్వొకేట్
అనుమతినిచ్చిన తెలంగాణ హైకోర్టు
ఫార్ములా - ఈ రేస్ కేసులో విచారణ సందర్భంగా మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెంట అడ్వొకేట్ వెళ్లేందుకు తెలంగాణ హైకోర్టు అనుమతి ఇచ్చింది. తన వెంట విచారణకు అడ్వొకేట్ ను అనుమతించాలని కోరుతూ కేటీఆర్ దాఖలు చేసిన లంచ్ మోషన్ పిటిషన్ పై బుధవారం మధ్యాహ్నం వాదనలు విన్న హైకోర్టు తదుపరి విచారణను సాయంత్రం 4 గంటలకు వాయిదా వేసింది. ముగ్గురు లాయర్ల పేర్లు ఇవ్వాలని కూడా కోరింది. మధ్యాహ్నం మరోసారి ఈ అంశాన్ని పరిగణలోకి తీసుకున్న హైకోర్టు కేటీఆర్ వెంట విచారణకు న్యాయవాది వెళ్లేందుకు పర్మిషన్ ఇచ్చింది. విచారణ జరిగేప్పుడు చూడటానికి మాత్రమే అడ్వొకేట్ కు అనుమతినిస్తున్నామని వెల్లడించింది. విచారణ సమయంలో కేటీఆర్ పక్కన అడ్వొకేట్ కూర్చోవడానికి హైకోర్టు నిరాకరించింది. కేటీఆర్ వెంట మాజీ అడ్వొకేట్ జనరల్ జె. రామచందర్ రావు విచారణకు హాజరవుతారని ఆయన తరపు న్యాయవాదులు హైకోర్టుకు తెలిపారు.