హైడ్రా తీరుపై హైకోర్టు ఆగ్రహం

నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవకముందే కూల్చివేతలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేసిన ఉన్నత న్యాయస్థానం

Advertisement
Update:2024-12-31 22:58 IST

నగరంలోని ఖాజాగూడ బ్రాహ్మణకుంటలో ఆక్రమణల తొలిగింపులో హైడ్రా వ్యవహరించిన తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నోటీసులు జారీ చేసి 24 గంటలు గడవకముందే కూల్చివేతలు చేపట్టడంపై అసహనం వ్యక్తం చేసింది. కూల్చివేతలపై హైడ్రా కమిషనర్‌కు గతంలో స్పష్టంగా చెప్పినా మళ్లీ అదే పద్ధతి కొనసాగిస్తున్నారని.. ఇలాగైతే మరోసారి కోర్టుకు పిలిపించాల్సి ఉంటుందని న్యాయస్థానం హెచ్చరించింది. ఎఫ్‌టీఎల్‌లో నిర్మాణాలు చేపట్టారని ఖాజాగూడలో హైడ్రా నిర్మాణాలను కూల్చివేయడాన్ని సవాల్‌ చేస్తూ మేకల అంజయ్య, మరికొంతమంది హైకోర్టులో లంచ్‌ మోషన్‌ పిటిషన్‌ దాఖలు చేశారు. దీనిపై జస్టిస్‌ కె. లక్ష్మణ్‌ విచారణ చేపట్టారు.

శేరిలింగంపల్లి మండలం ఖాజాగూడలోని కొన్నినిర్మాణాలు ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయంటూ ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే కూల్చివేతలు చేపట్టారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. హైడ్రా అధికారులు అక్కడ విచారించిన తర్వాతనే చర్యలు చేపట్టారని ప్రభుత్వ న్యాయవాది కోర్టుకు తెలిపారు. ఎలాంటి అనుమతులు లేకుండా పిటిషనర్లు నిర్మాణాలు చేపట్టారని జీహెచ్‌ఎంసీ తరఫు న్యాయవాది కోర్టు దృష్టికి తీసుకొచ్చారు.

వాదనలు విన్న న్యాయమూర్తి.. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా నిర్మాణాలను ఎలా కూల్చివేస్తారని ప్రశ్నించారు. అయితే, నోటీసులు ఇచ్చామని న్యాయవాది చెప్పగా..24 గంటలే సమయం ఇస్తారా? నోటీసులు జారీ చేసి బాధితుల వివరణ తీసుకోకుండా కూల్చివేతలు ఎలా చేపడుతారని ధర్మాసనం ప్రశ్నించింది. ఎఫ్‌టీఎల్‌ను నిర్ధారిస్తూ నోటిఫికేషన్‌ జారీ చేశారా? అని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎఫ్‌టీఎల్‌ పరిధిలోని ఆక్రమణల తొలిగింపునకు సంబంధించి చట్ట ప్రకారమే చర్యలు తీసుకోవాలని హైడ్రాను ఆదేశించారు. తాజాగా నోటీసులు జారీ చేసి పిటిషనర్‌ వివరణ తీసుకొని, చట్ట ప్రకారం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.

Tags:    
Advertisement

Similar News