లులు.. కిక్కిరిసిన జనాలు
లులు మాల్ లో పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. కిక్కిరిసిన ఎస్కలేటర్లు, ప్రధాన హాల్ లో కూడా జనం ఒకరినొకరు తోసుకుంటూ పోతున్న వీడియోలు వైరల్ గా మారాయి.
హైదరాబాద్ కూకట్ పల్లిలో నూతనంగా ప్రారంభించిన లులు మాల్ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. గతంలో కూడా ఇలాంటి మాల్స్ హైదరాబాద్ లో ప్రారంభం అయినా ఈ స్థాయిలో జనాలు ఎప్పుడూ రాలేదని అంటున్నారు. దేశంలో ఉన్న లులు మాల్స్ లో హైదరాబాద్ లో ఏర్పాటు చేసిందే అతి పెద్దది అనే ప్రచారం జరగడంతో.. అసలక్కడ ఏముందో చూద్దామని చాలామంది విండో షాపింగ్ కి బయలుదేరారు. అందులోనూ వరుస సెలవలు కావడంతో ఇంటర్నేషనల్ మాల్ లో అడుగుపెట్టడానికి ఉత్సాహం చూపించారు. ఒక్కసారిగా అందరూ ఉత్సాహపడటంతో లులు మాల్ నాలుగు రోజులుగా జనాలతో కిక్కిరిసి కనపడుతోంది.
సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు..
లులు మాల్ లో పరిస్థితి ఎలా ఉందో చూడండి అంటూ చాలామంది సోషల్ మీడియాలో ఫొటోలు, వీడియోలు అప్ లోడ్ చేస్తున్నారు. కిక్కిరిసిన ఎస్కలేటర్లు, ప్రధాన హాల్ లో కూడా జనం ఒకరినొకరు తోసుకుంటూ పోతున్న వీడియోలు వైరల్ గా మారాయి. ఇక షాపింగ్ కూడా జనాలకు కొత్త అనుభూతిని మిగులుస్తోంది. 75 ఇంటర్నేషనల్ బ్రాండ్ ల బట్టల షాపులు ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. చాలామంది ఉత్సాహంగా కొనుగోలు చేసినా.. బిల్ కౌంటర్ల వద్ద క్యూలైన్లు చూసి భయపడి బయటకు వచ్చేస్తున్నారు. ఒక్కొక్కరికి ఒక్కోరకమైన అనుభూతిని మిగిల్చుచోంది లులు మాల్.
భారీగా ట్రాఫిక్ జామ్..
లులు మాల్ ఓపెనింగ్ తర్వాత నేషనల్ హైవే -65 లో ట్రాఫిక్ పెరిగింది. మెట్రో పిల్లర్ A906 నుంచి పిల్లర్ A713 వరకు ట్రాఫిక్ రద్దీ స్పష్టంగా తెలుస్తోంది. కేపీహెచ్బీ కాలనీలో కూడా ట్రాఫిక్ రద్దీ పెరిగింది. మాల్ కు వెళ్లే వాహనాలతో కూకట్ పల్లి, బాలానగర్, వై జంక్షన్ వీధుల్లో ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 2 నుంచి 3 కిలోమీటర్ల ప్రయాణానికి గంటకు పైగా సమయం పడుతోందని అంటున్నారు స్థానికులు. మొత్తానికి లులు మాల్ ప్రారంభమైన నాలుగు రోజుల్లోనే సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.