ఊహించని వర్షపాతం.. తెలంగాణలో బీభత్సం

తెలంగాణలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయితే అది భారీ స్థాయి అని చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అత్యథికంగా 649.8 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. రికార్డులు బ్రేక్ చేసింది.

Advertisement
Update:2023-07-27 10:52 IST

తెలంగాణలో మునుపెన్నడూ చూడని ఉప్పెన ఇది. గతంలో తుపానుల ప్రభావం ఉన్నా కూడా గరిష్టంగా వారం రోజులపాటు వర్షాలు ఇబ్బంది పెట్టేవి. కానీ ఈసారి వారం రోజులు దాటుతున్నా వర్షాల ప్రభావం తగ్గలేదు. పైగా రాబోయే రెండు రోజుల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయనే హెచ్చరికలున్నాయి. తెలంగాణలో దాదాపు అన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురవడం ఇటీవల కాలంలో ఇదే ప్రథమం. వర్షపాతం గణాంకాలు కూడా ప్రమాద తీవ్రతను తెలియజేస్తున్నాయి.

తెలంగాణలో ఈ సీజన్ లో సాధారణ వర్షపాతం 1.56 సెంటీమీటర్లు కాగా.. దాదాపు 200ల కేంద్రాల్లో ఇప్పుడు 10 సెం.మీ. పైగా వర్షం కురిసింది. 35 ప్రాంతాల్లో 20 సెం.మీ. పైన వర్షం కురిసింది. ఇది తెలంగాణ చరిత్రలోనే అత్యధికం. గతంలో 2013 జులైలో ములుగు జిల్లా వాజేడులో 51.7 సెంటీమీటర్ల వర్షపాతం అత్యధికం కాగా.. ఇప్పుడా రికార్డు తుడిచిపెట్టుకుపోయింది. ములుగు జిల్లా లక్ష్మీదేవి పేటలో 64.9 సెంటీమీటర్ల వర్షం కురిసింది. సరికొత్త కొత్త రికార్డు నమోదైంది.




ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేటలో గడచిన 24గంటల్లో 649.8 మిల్లీమీటర్ల గరిష్ట వర్షపాతం నమోదైంది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాలలో 616.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది, ఇది రెండోగరిష్టం. ఒక ఏడాది మొత్తం కురవాల్సిన వర్షంలో దాదాపు 70శాతం వరకు ఒకేరోజు కురవడం అంటే మామూలు విషయం కాదు. లక్ష్మీదేవిపేట, చిట్యాల, చేల్పూరు, రేగొండ, మొగుల్ల పల్లిలో.. భారీ వర్షాలు కురిశాయి. ఊహించని విధంగా కురిసిన వర్షాలతో తెలంగాణ జిల్లాలు వణికిపోతున్నాయి.

తెలంగాణలో 64.5 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయితే అది భారీ స్థాయి అని చెప్పుకోవాలి. 115.60 మిల్లీమీటర్లు దాటితే అతి భారీ.. 204.5 మిల్లీమీటర్లు దాటితే అత్యంత భారీ వర్షపాతం నమోదైనట్టు లెక్క. కానీ ఈసారి అత్యంత భారీ అనేది నామమాత్రంగా మారింది. వరంగల్, జనగాం, ఆదిలాబాద్, హన్మకొండ, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ములుగు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలు ప్రకృతి ప్రకోపానికి నిదర్శనంగా నిలిచాయి. ఆయా జిల్లాల్లో 204.5 మిల్లీమీటర్లకంటే అత్యథిక వర్షపాతం నమోదైంది. గరిష్టంగా 649.8 మిల్లీమీటర్లు కురిసింది.

ఇప్పటి వరకూ ఇదే అత్యథికం అనుకుంటే.. మరో రెండురోజులపాటు అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెేసిన హెచ్చరికలు ఆందోళన కలిగిస్తున్నాయి. తెలంగాణలో మరింత విధ్వంసం జరిగే అవకాశముంది, ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.

Tags:    
Advertisement

Similar News