హైదరాబాద్ లో కుండపోత.. మరో 3 రోజులు ఇంతే..

మరో మూడు రోజులు వర్షాలు తగ్గే అవకాశం లేదు. దీంతో వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది.

Advertisement
Update:2023-07-25 07:40 IST

అల్పపీడన ప్రభావంతో హైదరాబాద్ లో భారీ వర్షం కురిసింది. వారం రోజులుగా వర్షం ముసురు తగ్గకపోయినా రాత్రి అతి భారీ వర్షం కురవడంతో నగరవాసులు ఇబ్బంది పడ్డారు. చినుకు చినుకు మొదలై రాత్రి ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. దీంతా చాలాచోట్ల ప్రధాన రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ట్రాఫిక్ స్తంభించింది.

సాయంత్రం ఐదుగంటలనుంచే కుండపోత మొదలైంది. ఆరు గంటల సమయానికి మియాపూర్‌ లో 3.65 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. చార్మినార్ లో రాత్రి 7 గంటలకు 4.78 సెంటీమీటర్లు, సరూర్ నగర్ లో 4.4 సెం.మీ. వర్షం కురిసింది. ఇటీవల కాలంలో ఎప్పుడూ ఈ స్థాయిలో వర్షం కురవలేదు. అది కూడా ఆఫీస్ లు వదిలి పెట్టే సమయంలో వర్షం నాన్ స్టాప్ గా కురవడంతో ట్రాఫిక్ సమస్య ఎదురైంది.

హైదరాబాద్ తో పాటు పరిసర జిల్లాల్లో కూడా రాత్రి కుంభవృష్టి కురిసింది. రాత్రి 10 గంటల వరకు అత్యధికంగా సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ లో 11.7 సెంటీమీటర్ల వర్షం కురిసింది. వరంగల్‌ జిల్లా సంగెంలో 9 సెంటీమీటర్లు, సూర్యాపేట జిల్లా ముకుందాపురంలో 8.4 సెం.మీ., దండుమైలారంలో 7.7 సెం.మీ., వర్షపాతం నమోదైంది.

రెడ్ అలర్ట్..

మరో మూడు రోజులు వర్షాలు తగ్గే అవకాశం లేదు. దీంతో వాతావరణ శాఖ మరోసారి రెడ్ అలర్ట్ జారీ చేసింది. ముఖ్యంగా హైదరాబాద్ వాసులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు. రాత్రి వర్షానికి అధికార యంత్రాంగం పరుగులు పెట్టింది. ఎక్కడికక్కడ ట్రాఫిక్ క్లియర్ చేసి, వర్షపు నీరు బయటకు వెళ్లేలా చర్యలు చేపట్టింది. 3 రోజుల హెచ్చరికల నేపథ్యంలో మరిన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటోంది.

Tags:    
Advertisement

Similar News