హైదరాబాద్ లో కుండపోత.. ఫుల్ ట్యాంక్ లెవల్ దాటిన హుస్సేన్ సాగర్

హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌ సాగర్‌ నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ దాటింది. జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ కూ వరదనీరు పోటెత్తుతోంది.

Advertisement
Update:2023-07-21 11:20 IST

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. హైదరాబాద్ లో జులై నెల మొత్తం కురవాల్సిన వర్షం గడచిన 24గంటల్లోనే నమోదు కావడం విశేషం. గత 24గంటల వ్యవధిలో హైదరాబాద్ లో 18.83 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. జులై నెల సగటు వర్షపాతం 16.2 సెంటీమీటర్లు కాగా.. దాన్ని మించి ఒకరోజు వ్యవధిలోనే కుంభవృష్టి కురవడం విశేషం. మియాపూర్ లో అత్యథిక వర్షపాతం నమోదైంది. బోడుప్పల్, కర్మన్ ఘాట్ వంటి ప్రాంతాల్లో పలు కాలనీల్లోకి వర్షపు నీరు చేరింది.

మూసీ పరవళ్లు..

యాదాద్రి భువనగిరి జిల్లాతో పాటు హైదరాబాద్‌ పరిసరాల్లో కురుస్తున్న భారీ వర్షాలతో మూసీ నది ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. పలు ప్రాంతాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వలిగొండ మండలం సంగం పరిధిలో మూసీ వంతెన పైనుంచి వరదనీరు ప్రవహిస్తోంది. బొల్లేపల్లి-చౌటుప్పల్‌ మార్గంలో రాకపోకలు నిలిచిపోయాయి. రుద్రవెల్లి వద్ద కాజ్‌ వే పైనుంచి వరద నీరు ప్రవహిస్తుండటంతో పోచంపల్లి-బీబీ నగర్‌ మార్గంలో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

హుస్సేన్‌ సాగర్‌ కు భారీ వరద

హైదరాబాద్‌లోని హుస్సేన్‌ సాగర్‌ కు భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. హుస్సేన్‌ సాగర్‌ నీటిమట్టం ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ దాటింది. ఫుల్‌ ట్యాంక్‌ లెవల్‌ సామర్థ్యం 513.45 మీటర్లు కాగా.. ప్రస్తుతం 514.75 మీటర్లకు పైగా నీరు చేరుతోంది. జంట జలాశయాలైన ఉస్మాన్‌ సాగర్‌, హిమాయత్‌ సాగర్‌ కూ వరదనీరు పోటెత్తుతోంది. ఉస్మాన్‌ సాగర్‌ లో 1100 క్యూసెక్కుల వరద వచ్చి చేరడంతో నీటి మట్టం 1784.70 అడుగులకు చేరింది. హిమాయత్‌ సాగర్‌ కు 1200 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. దీంతో నీటిమట్టం 1761.20 అడుగులకు చేరింది. జంట జలాశయారు పూర్తి స్థాయి నీటిమట్టంతో నిండుకుండల్లా ఉన్నాయి.

ముందు జాగ్రత్తగా విద్యాసంస్థలతోపాటు, ప్రభుత్వ కార్యాలయాలకు కూడా ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు, వ్యాపారులు, అత్యవసర పనులపై బయటకు వచ్చేవారు మాత్రం అవస్థలు పడుతున్నారు. 

Tags:    
Advertisement

Similar News