తెలంగాణ గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులపై నేడు సుప్రీంకోర్టులో విచారణ

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వేసిన పిటిషన్‌లో పెండిగ్ బిల్లులకు ఆమోద ముద్ర పడకపోవడం పాలనపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు.

Advertisement
Update:2023-04-10 09:18 IST

తెలంగాణ అసెంబ్లీలో పాస్ అయిన బిల్లులు గవర్నర్ తమిళిసై సౌందర్‌రాజన్ వద్దనే చాన్నాళ్లుగా పెండింగ్‌లో ఉన్నాయి. రాష్ట్ర మంత్రులు పలుమార్లు రాజ్‌భవన్‌కు వెళ్లి పెండింగ్ బిల్లులను పాస్ చేయాలని కోరినా.. గవర్నర్ వద్ద నుంచి మోక్షం కలగడం లేదు. కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఆదేశాలతోనే గవర్నర్ వాటికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. దీంతో పెండింగ్ బిల్లులను గవర్నర్ ఆమోదించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ రాష్ట్ర సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇప్పటికే ఒక సారి విచారణ జరిపిన సుప్రీంకోర్టు ఈ కేసులో ప్రతివాదులుగా గవర్నర్ కార్యదర్శి, కేంద్ర న్యాయ శాఖ కార్యదర్శిని చేర్చారు.

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి వేసిన పిటిషన్‌లో పెండిగ్ బిల్లులకు ఆమోద ముద్ర పడకపోవడం పాలనపై ప్రభావం చూపిస్తోందని పేర్కొన్నారు. గవర్నర్ వద్ద బిల్లులు పెండింగ్‌లో ఉండటం ప్రజాస్వామ్య స్పూర్తి, ప్రజల ఆకాంక్షకు విరుద్దమని తెలంగాణ ప్రభుత్వం వాదిస్తోంది. గవర్నర్ వద్ద 10 బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయని పేర్కొన్నది. గవర్నర్ కార్యదర్శితో ఇప్పటికే అడిషనల్ సొలిసిటర్ జనరల్ చర్చలు జరిపారు. రాజ్యాంగంలోని 200వ ఆర్టికల్ ప్రకారం గవర్నర్ బిల్లులను ఆమోదించడం లేదా రాష్ట్రపతి పరిశీలనకు పంపాలని తెలంగాణ వేసిన పిటిషన్‌లో పేర్కొన్నారు.

గవర్నర్ తీరు మంత్రి మండలి సలహాకు వ్యతిరేకంగా ఉందని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. బిల్లులను పెండింగ్‌లో పెట్టే విచక్షణాధికారం గవర్నర్‌కు ఉండదని ప్రభుత్వం చెబుతోంది. సదరు బిల్లులు గవర్నర్ పెండింగ్‌లో పెట్టడానికి న్యాయమైన కారణాలు ఏవీ లేవని వాదిస్తోంది. కొన్ని నెలలుగా రాజ్‌భవన్‌లోనే పెండింగ్ బిల్లుల ఫైళ్లు ఉన్నాయని.. పలు మార్లు విజ్ఞప్తి చేసినా గవర్నర్ ఆమోద ముద్ర వేయలేదని అంటోంది. వేరే మార్గం లేకనే సుప్రీంకోర్టును ఆశ్రయించినట్లు పేర్కొన్నది. కాగా, సుప్రీంకోర్టు ఈ విషయంలో ఏ నిర్ణయం తీసుకుంటుందా అనే ఆసక్తి నెలకొన్నది.


గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉన్న బిల్లులు..

1. అజామాబాద్ ఇండస్ట్రియల్ ఏరియా (టర్మినేషన్ అండ్ రెగ్యులేషన్ ఆఫ్ లీజు) (సవరణ) బిల్లు

2. తెలంగాణ మున్సిపల్ చట్టాల (సవరణ) బిల్లు

3. తెలంగాణ పబ్లిక్ ఎంప్లాయ్‌మెంట్ (విశ్వాసం యొక్క వయస్సు నియంత్రణ) (సవరణ) బిల్లు

4. యూనివర్శిటీ ఆఫ్ ఫారెస్ట్రీ తెలంగాణ బిల్లు

5. తెలంగాణ యూనివర్సిటీస్ కామన్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ బిల్లు

6. తెలంగాణ మోటార్ వెహికల్స్ టాక్సేషన్ (సవరణ) బిల్లు

7. తెలంగాణ రాష్ట్ర ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు (స్థాపన మరియు నియంత్రణ) (సవరణ)

8. ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం (సవరణ) బిల్లు

9. తెలంగాణ పంచాయతీ రాజ్ (సవరణ) బిల్లు

10. తెలంగాణ మునిసిపాలిటీల నిబంధనల చట్ట (సవరణ) బిల్లు 

Tags:    
Advertisement

Similar News