బంగ్లాదేశ్ లోనూ హరితహారం..

ఈ పథకానికి ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపించడం విశేషం. తాజాగా బంగ్లాదేశ్ తమ దేశంలో కూడా హరితహారం కార్యక్రమం చేపడతామంటోంది.

Advertisement
Update:2022-11-16 20:15 IST

హరితహారం కార్యక్రమం తెలంగాణలో విజయవంతంగా అమలవుతోంది. ఈ కార్యక్రమం స్ఫూర్తితో ఇతర రాష్ట్రాల్లో కూడా పచ్చదనం పెంచేందుకు స్థానిక ప్రభుత్వాలు ఆసక్తి చూపిస్తున్నాయి. హరితహారం ప్రారంభించిన తర్వాత గ్రామీణ ప్రాంతాలతోపాటు, పట్టణ ప్రాంతాల్లో కూడా పచ్చదనం బాగా పెరిగింది. నగర వనాలు హైదరాబాద్ కి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి. ఈ పథకానికి ఇతర దేశాలు కూడా ఆసక్తి చూపించడం విశేషం. తాజాగా బంగ్లాదేశ్ తమ దేశంలో కూడా హరితహారం కార్యక్రమం చేపడతామంటోంది.


తెలంగాణ ప్ర‌భుత్వం అమ‌లు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ ప‌థ‌కాల‌పై బంగ్లాదేశ్ మేయ‌ర్ల బృందం ప్ర‌శంసల వ‌ర్షం కురిపించింది. బంగ్లాదేశ్‌ కు చెందిన 13 మంది మేయ‌ర్లు, ముగ్గురు అధికారుల‌తో కూడిన ప్ర‌తినిధి బృందం తెలంగాణ‌లో ప‌ర్య‌టిస్తోంది. ఈ ప‌ర్య‌ట‌న‌లో భాగంగా మాసాబ్ ట్యాంక్‌ లోని కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ (CDMA) కార్యాలయాన్ని బంగ్లాదేశ్ ప్రతినిధులు సంద‌ర్శించారు. ఈ సంద‌ర్భంగా తెలంగాణ మున్సిప‌ల్, ప‌ట్ట‌ణాభివృద్ధి శాఖ అమ‌లు చేస్తున్న వివిధ కార్య‌క్ర‌మాల‌ను అధికారులు వారికి వివ‌రించారు.

అన్నీ సూపర్, హరితహారం ఇంకా సూపర్..

బ‌యో మైనింగ్, ఇంటింటి నుంచి చెత్త సేక‌ర‌ణ‌, ద్ర‌వ‌, ఘ‌న వ్య‌ర్థాల నిర్వ‌హ‌ణ‌, ఇంటిగ్రేటెడ్ వెజ్, నాన్‌ వెజ్ మార్కెట్లు, వైకుంఠ‌ధామాలతో పాటు ప‌లు కార్య‌క్ర‌మాల‌ అమలు అద్భుతంగా ఉందని కొనియాడారు బంగ్లాదేశ్ మేయర్లు. హరితహారం పట్ల వారు ప్రత్యేక ఆసక్తి చూపించారు. తెలంగాణ చేపట్టిన హరితహారం కార్యక్రమం అద్భుతంగా ఉందని వారు కొనియాడారు. బంగ్లాదేశ్‌ లోనూ ఈ తరహా విధానాలను, సంస్కరణలను అమలు చేసి మరింత మెరుగైన పాలనను అందించే విధంగా కృషి చేస్తామని వారు ప్రకటించారు.

Tags:    
Advertisement

Similar News