నిరుద్యోగుల ఆందోళన.. రేవంత్‌కు హరీష్ రావు వార్నింగ్!
పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే, అది మరింత ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు.
గ్రూప్స్, డీఎస్సీ లాంటి పోటీ పరీక్షల నిర్వహణ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండదని, నోటిఫికేషన్ ప్రకారమే ఎగ్జామ్స్ నిర్వహిస్తామంటూ సీఎం రేవంత్ చేసిన వ్యాఖ్యలపై నిరుద్యోగులు భగ్గుమన్నారు. శనివారం రాత్రి అశోక్ నగర్‌లో వందలాది మంది భారీ ర్యాలీ నిర్వహించారు. సెంట్రల్ లైబ్రరీ నుంచి ఇందిరాపార్క్ వరకు ఈ ర్యాలీ సాగింది. దిల్‌సుఖ్‌నగర్‌లోనూ నిరుద్యోగులు ఆందోళనకు దిగారు. గ్రూప్-2, గ్రూప్-3 పోస్టులు పెంచి మరికొంత సమయం ఇవ్వాలని, డీఎస్సీని వాయిదా వేయాలని డిమాండ్ చేశారు. ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
ఈ అంశంపై మాజీ మంత్రి హరీష్ రావు ట్వీట్ చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగుల విజ్ఞప్తులను పట్టించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి మరోసారి సూచించారు. భేషజాలకు పోకుండా, నిరుద్యోగుల జీవితాలు, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సమస్యకు పరిష్కారం చూపాలని విజ్ఞప్తి చేశారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను చర్చలకు పిలుచుకుని వారి బాధను, డిమాండ్లను అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలని సీఎంను కోరారు హరీష్ రావు.
నిరుద్యోగులను రెచ్చగొట్టే విధంగా, కించపరిచే విధంగా మాట్లాడి అభాసుపాలు కావొద్దన్నారు హరీష్ రావు. నిరుద్యోగులు ధైర్యం కోల్పోయే విధంగా వ్యవహరించొద్దని సీఎంకు సూచించారు. పోలీసు బలగాలు, లాఠీలు, ఇనుప కంచెలు, బ్యారికేడ్లతో విద్యార్థుల పోరాటాన్ని అణిచివేసే ప్రయత్నం చేస్తే, అది మరింత ఉద్ధృతం అవుతుందని హెచ్చరించారు. గ్రూప్స్ అభ్యర్థులు, నిరుద్యోగులను ఇబ్బందులకు గురి చేసినా, వారిపై భౌతిక దాడులకు పాల్పడిన సహించేది లేదంటూ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.