హరీష్ రావు వర్సెస్ శ్రీధర్ బాబు.. రాజీనామా సవాల్
కేసీఆర్‌కు బదులుగా హరీష్ హాజరవ్వడంపై శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అనుమతి లేకపోయినా BAC ఎలా వస్తారని హరీష్ రావును శ్రీధర్ బాబు ప్రశ్నించారు.
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా నిర్వహించిన బిజినెస్ అడ్వైజరీ కమిటీ-BAC సమావేశంలో శాసనసభా వ్యవహారాల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు, మాజీ మంత్రి హరీష్ రావుల మధ్య వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. ప్రతిపక్ష నేత కేసీఆర్‌కు బదులుగా BAC సమావేశానికి హరీష్ రావు హాజరయ్యారు.
అయితే కేసీఆర్‌కు బదులుగా హరీష్ హాజరవ్వడంపై శ్రీధర్ బాబు అభ్యంతరం చెప్పినట్లు సమాచారం. అనుమతి లేకపోయినా BAC ఎలా వస్తారని హరీష్ రావును శ్రీధర్ బాబు ప్రశ్నించారు. స్పీకర్ అనుమతి తీసుకున్నాకే తాను BACకి హాజరయ్యానని హరీష్ సమాధానం ఇచ్చినట్లు తెలుస్తోంది. దీంతో కొత్త సంప్రదాయం సరికాదని హరీష్ హాజరుపై శ్రీధర్‌బాబు అభ్యంతరం చెప్పారు.
గతంలోనూ ఈ సంప్రదాయం ఉందన్న హరీష్ రావు.. అలాంటి సంప్రదాయం గతంలో లేకపోతే రాజీనామా చేస్తానని సవాల్ చేసినట్లు సమాచారం. అయితే ఇద్దరి మధ్యలో కలగజేసుకున్న స్పీకర్ గడ్డం ప్రసాద్.. BAC రూల్స్ అర్థం చేసుకుని సహకరించాలని కోరినట్లు సమాచారం. తర్వాత మీ ఇష్టం అంటూ హరీష్ రావు BAC సమావేశం నుంచి బయటకు వచ్చారు.