అది ముమ్మాటికీ బాధ్యతా రాహిత్యమే -హరీష్ రావు
ఐటీఐల రూపురేఖలు మార్చేస్తున్నామంటూ సీఎం రేవంత్ రెడ్డి అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించిన మరుసటి రోజే బీఆర్ఎస్ నుంచి ఈ విమర్శలు రావడం విశేషం.
తెలంగాణలో జూనియర్ కాలేజీలు ప్రారంభమై 19 రోజులు అవుతున్నా, ఇప్పటివరకు పాఠ్యపుస్తకాలు అందించకపోవడం బాధ్యతారాహిత్యం అని విమర్శించారు మాజీ మంత్రి హరీష్ రావు. ప్రజా పాలన అని ప్రచారం చేసుకునే ఈ ప్రభుత్వానికి విద్య, విద్యార్థుల భవిష్యత్తు మీద ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో దీన్నిబట్టి అర్థం అవుతుందని చెప్పారాయన. తెలంగాణ వ్యాప్తంగా 422 జూనియర్ కాలేజీల్లో లక్షా 60 వేల మంది పేద, బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులు చదువుతున్నారని, వారికి నాణ్యమైన విద్య అందించడంలో ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు హరీష్ రావు.
జీరో అడ్మిషన్స్..
తెలంగాణలోని కొన్ని ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ లో జీరో అడ్మిషన్స్ నమోదయ్యాయని గుర్తు చేశారు హరీష్ రావు. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని, ఇంటర్ విద్యను బలోపేతం చేసేందుకు చర్యలు చేపట్టాలని కోరారాయన. పాఠ్యపుస్తకాలు వెంటనే పంపిణీ చేయాలని, జూనియర్ కాలేజీల్లో విధులు నిర్వర్తించే 1654 గెస్ట్ ఫ్యాకల్టీలను రెన్యువల్ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. తెలంగాణలో కొత్తగా ఏర్పాటవుతున్న ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు లెక్చరర్ పోస్టులు మంజూరు చేసి విద్యార్థులకు నాణ్యమైన విద్య అందేలా చర్యలు తీసుకోవాలని కోరారు హరీష్ రావు.
ఐటీఐల రూపురేఖరు మార్చేస్తున్నారమంటూ సీఎం రేవంత్ రెడ్డి అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లను ప్రారంభించిన మరుసటి రోజే బీఆర్ఎస్ నుంచి ఈ విమర్శలు రావడం విశేషం. ఇంటర్ విద్యను తెలంగాణ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు హరీష్ రావు. ఈ విమర్శలపై కాంగ్రెస్ నేతలు ఎలా స్పందిస్తారో చూడాలి.