ముఖ్యమంత్రుల ముఖాముఖి.. బీఆర్ఎస్ కీలక సూచన

సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణకు మేలు జరిగేలా ముఖ్యమంత్రుల భేటీని ఉపయోగించుకోవాలని సూచించారు హరీష్ రావు.

Advertisement
Update: 2024-07-03 05:40 GMT

ఏపీ సీఎం చంద్రబాబు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి భేటీకి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఇరువురు ముఖ్యమంత్రులు ముందుగా లేఖల ద్వారా ఈ ప్రయత్నానికి నాంది పలికారు. ఆ తర్వాత డేట్ ఫిక్స్ చేశారు. ఈనెల 6న ప్రజా భవన్ లో ఈ భేటీ జరగాల్సి ఉంది. దీనికి సంబంధించి అధికారులు ఏర్పాట్లు మొదలు పెట్టినట్టు తెలుస్తోంది. అయితే ఈ కీలక భేటీలో సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ నుంచి కొన్ని డిమాండ్లను ఏపీ సీఎం చంద్రబాబు ముందు ఉంచాలని బీఆర్ఎస్ సూచిస్తోంది.

రాష్ట్ర విభజన సమయంలో ఏపీలో కలిపిన ఏడు మండలాల కోసం ఈ భేటీలో పట్టుబట్టాలని చెప్పారు మాజీ మంత్రి హరీష్ రావు. ఏడు మండలాలు, లోయర్‌ సీలేరును ఏపీలో కలపడాన్ని అప్పట్లో కేసీఆర్‌ తీవ్రంగా వ్యతిరేకించారని ఆయన గుర్తుచేశారు. రేవంత్‌రెడ్డి సహచరుడు చంద్రబాబు మద్దతుపైనే ఎన్డీయే ప్రభుత్వం ఆధారపడి ఉంది కాబట్టి.. కేంద్రాన్ని చంద్రబాబు ఒప్పించడం సులువేనన్నారు హరీష్ రావు. చంద్రబాబుని రేవంత్ రెడ్డి ఒప్పిస్తే పనైపోతుందని చెప్పారు. తెలంగాణ కోల్పోయిన ఏడు మండలాలు, లోయర్‌ సీలేరు మనకు వచ్చేలా చేయాలని రేవంత్‌ రెడ్డిని కోరారు హరీష్ రావు.

కాంగ్రెస్ పాలనపై విమర్శలు..

కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏడు నెలల పాలనలో పట్టణాలు, పంచాయతీలకు పైసా కూడా ఇవ్వకపోవడంతో చెత్త ఎక్కడికక్కడ పేరుకుపోయిందని, దీంతో వ్యాధులు ప్రబలుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు హరీష్ రావు. కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పట్టణ ప్రగతి, పల్లెప్రగతి ద్వారా ప్రతినెలా స్థానిక సంస్థలకు నిధులు విడుదల చేశామని గుర్తుచేశారు. తెలంగాణ పల్లెలను దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దామని అన్నారు. జాతీయస్థాయిలో తెలంగాణ పల్లెలు పలు అవార్డులు దక్కించుకున్నాయని కూడా హరీష్ రావు గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యల పరిష్కారంపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి పెట్టాలన్నారు. తెలంగాణకు మేలు జరిగేలా ముఖ్యమంత్రుల భేటీని ఉపయోగించుకోవాలని సూచించారు హరీష్ రావు.

Tags:    
Advertisement

Similar News