నామినేషన్ వేసిన మంత్రి హరీష్ రావు.. పూజ జరిగింది ఆ ఆలయంలోనే

సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావుకి ఈసారి ఎంత మెజార్టీ వస్తుందనేది ఆసక్తిగా మారింది. 2018 ఎన్నికల్లో అత్యధికంగా ఆయనకు 1,18,699 ఓట్ల మెజార్టీ వచ్చింది. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 78.59 శాతం ఓట్లు వచ్చాయి.

Advertisement
Update:2023-11-09 12:27 IST

తెలంగాణలో నామినేషన్ల ఘట్టం కీలక దశకు చేరుకుంది. రేపు ఆఖరు తేదీ కావడంతో.. ఈ రోజే దాదాపుగా కీలక నేతలంతా నామినేషన్లు వేస్తున్నారు. ముఖ్యంగా బీఆర్ఎస్ నేతలంతా ఈ రోజు నామినేషన్లు పూర్తి చేస్తారు. సీఎం కేసీఆర్, మంత్రులు కేటీఆర్, హరీష్ రావు కూడా ఈ రోజే నామినేషన్లు వేస్తున్నారు. మంత్రి హరీష్ రావు సిద్ధిపేటలో రెండు సెట్ల నామినేషన్ దాఖలు చేశారు.


ఆలయంలో పూజలు, ఈద్గాలో ప్రార్థనలు..

మంత్రి హరీష్ రావుకి కూడా నామినేషన్ వేసే విషయంలో సెంటిమెంట్ ఉంది. సిద్ధిపేటలోని వెంకటేశ్వర స్వామి ఆలయంలో నామినేషన్ పత్రాలతో మంత్రి హరీష్ రావు పూజలు నిర్వహించారు. స్వామివారి సన్నిధిలోనే ఆ పత్రాలపై సంతకాలు చేశారు. అనంతరం పట్టణంలోని ఈద్గాలో ప్రార్థనలు చేశారు. క్రైస్తవ మత పెద్దల ఆశీర్వాదం తీసుకున్నారు. సర్వమత ప్రార్థనల అనంతరం సిద్ధిపేటలోని ఆర్వో కార్యాలయానికి చేరుకుని తన నామినేషన్ పత్రాలు సమర్పించారు హరీష్ రావు.

మెజార్టీపైనే అందరి దృష్టి..

సిద్ధిపేటలో మంత్రి హరీష్ రావుకి ఈసారి ఎంత మెజార్టీ వస్తుందనేది ఆసక్తిగా మారింది. 2004నుంచి సిద్ధిపేటకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఆయన ప్రతిసారీ తన మెజార్టీని పెంచుకుంటూ పోతున్నారు. 2018 ఎన్నికల్లో అత్యధికంగా ఆయనకు 1,18,699 ఓట్ల మెజార్టీ వచ్చింది. పోలైన మొత్తం ఓట్లలో ఆయనకు 78.59శాతం ఓట్లు వచ్చాయి. ఈసారి హరీష్ రావు సిద్ధిపేటతోపాటు రాష్ట్రంలోని ఇతర నియోజకవర్గాల్లో కూడా సుడిగాలి పర్యటన చేపట్టారు. మెదక్ జిల్లాపై పూర్తి స్థాయిలో ఫోకస్ పెట్టారు. సిద్ధిపేటలో ఈసారి హరీష్ రావు మెజార్టీ ఎంత మేర పెరుగుతుందనేది ఆసక్తికరంగా మారింది. 


Tags:    
Advertisement

Similar News