ఏ ఒక్కరికి సమస్య వచ్చినా.. అందరం బస్ వేసుకుని వచ్చేస్తాం
ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు హరీష్ రావు. ముందు ముందు అసలు సినిమా ఉంటుందన్నారు.
నెల రోజుల తర్వాత కేసీఆర్ కూడా తెలంగాణ భవన్ లో అందరికీ అందుబాటులో ఉంటారని చెప్పారు హరీష్ రావు. ఏ ఒక్కరికి ఏ సమస్య వచ్చినా అందరం బస్ వేసుకుని వచ్చేస్తామని హామీ ఇచ్చారు. కార్యకర్తలను కాపాడుకునేందుకు ట్రస్ట్ ఏర్పాటు చేస్తామన్నారు. వారి పిల్లలకు విద్య, ఉపాధి విషయాల్లో సహకారం అందిస్తామని చెప్పారు. అక్రమ కేసుల నుండి కార్యకర్తలను కాపాడేందుకు లీగల్ సెల్ ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లా కార్యాలయాల్లో కూడా నేతలు అందుబాటులో ఉంటారన్నారు.
మహబూబాబాద్ పార్లమెంటరీ స్థాయి సమావేశంలో పాల్గొన్న హరీష్ రావు కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. లోక్ సభ ఎన్నికల్లో అందరం కష్టపడాలన్నారు. కార్యకర్తలు, స్థానిక నేతలు చెప్పిన అంశాలన్నిటినీ చర్చిస్తామన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో చాలా నియోజకవర్గాల్లో స్వల్ప తేడాతో ఓడిపోయామని గుర్తు చేశారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య ఓటింగ్ శాతంలో ఉన్న తేడా చాలా తక్కువ అన్నారు. లోక్ సభ ఎన్నికల నాటికి ఆ తేడా చెరిపేయాలని, మెజార్టీ స్థానాలు సాధించాలని చెప్పారు.
ముందుంది సినిమా..
ఎన్నికల తర్వాత జరిగిన తొలి అసెంబ్లీ సమావేశాల్లో కాంగ్రెస్ కి చూపెట్టింది కేవలం ట్రైలర్ మాత్రమేనన్నారు హరీష్ రావు. ముందు ముందు అసలు సినిమా ఉంటుందన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో తమ ధాటికి కాంగ్రెస్ నేతలు తట్టుకోలేకపోయారని, సమాధానాలు చెప్పలేక పలాయనం చిత్తగించారన్నారు. ఖమ్మంలో మూడు రకాల కాంగ్రెస్ పార్టీలు ఉన్నాయని ఎద్దేవా చేశారు హరీష్ రావు. వారిలో వారికే పడటం లేదని విమర్శించారు. కాళేశ్వరం, విద్యుత్ అవినీతి అని గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.