రేవంత్ ని అరెస్ట్ చేయాల్సిందే.. లేదంటే
రేవంత్ రెడ్డికి నోటీసులిచ్చి సరిపెట్టడం కాదని, ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
తెలంగాణ రాజకీయాల్లో అమిత్ షా వీడియో ఇప్పుడు సంచలనంగా మారింది. ఆ వీడియో విషయంలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి కూడా ఢిల్లీ పోలీసులు నోటీసులిచ్చారు. నోటీసులపై రేవంత్ రెడ్డి కూడా ఘాటుగా స్పందించారు. కేంద్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నవారందర్నీ ఇలా భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు ఇది బీజేపీ వర్సెస్ కాంగ్రెస్.. అన్నట్టుగా సాగుతున్న గొడవ. అయితే తాజాగా ఈ ఎపిసోడ్ లోకి బీఆర్ఎస్ కూడా ఎంటరైంది. రేవంత్ రెడ్డికి నోటీసులిచ్చి సరిపెట్టడం కాదని, ఆయన్ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు.
ఇలాంటి కేసులో గతంలో అసోంకు చెందిన ఒకరిని అరెస్టు చేశారని, అవే నిబంధనల ప్రకారం తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కూడా అరెస్టు చేయాలని అన్నారు హరీష్ రావు. అరెస్ట్ జరగలేదంటే.. ప్రధాని మోదీ, రేవంత్‌రెడ్డి ఇద్దరూ కలిసిపోయినట్టేనని వ్యాఖ్యానించారు. బీజేపీ, కాంగ్రెస్ ఒక్కటేనని.. ప్రజల్ని మోసం చేసేందుకే ఇలా నోటీసుల డ్రామాలాడుతున్నాయని మండిపడ్డారు. అమిత్ షా వీడియో సృష్టికర్తలెవరో దర్యాప్తు సంస్థలకు తెలుసని, అయినా కూడా బీజేపీ చెప్పినట్టు నోటీసులిచ్చి సరిపెట్టారని, ఆ కేసులో రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేయాల్సిందేనని డిమాండ్ చేశారు హరీష్ రావు. అరెస్ట్ జరగలేటందే.. బడే భాయ్, ఛోటే భాయ్ ఒకటేనని చెప్పడానికి మరో రుజువు దొరికినట్టేనన్నారు.
అప్పుడు ప్రామిసరీ నోట్లు.. ఇప్పుడు గాడ్ ప్రామిస్
అసెంబ్లీ ఎన్నికల సమయంలో ప్రామిసరీ నోట్ల పేరుతో ప్రజల్ని నమ్మించిన కాంగ్రెస్ నేతలు ఇప్పుడు గాడ్ ప్రామిస్ అంటూ ఓట్లు అడుగుతున్నారని ఎద్దేవా చేశారు హరీష్ రావు. మోసకారి కాంగ్రెస్‌కు లోక్ సభ ఎన్నికల్లో గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. అయితే తిట్లు.. లేకపోతే ఒట్లు అన్నట్టుగా రేవంత్ రెడ్డి పరిస్థితి ఉందన్నారు. 100 రోజుల్లో హామీలన్నీ అమలు చేస్తామని బాండ్ పేపరు రాసిచ్చి.. అధికారంలోకి వచ్చి 140 రోజులు గడచినా ఒక్క హామీని కూడా అమలు చేయకుండా మోసం చేశారని మండిపడ్డారు హరీష్ రావు. కాంగ్రెస్ మీద కోపంతో బీజేపీకి ఓటు వేస్తే పెనం మీది నుంచి పొయ్యిలో పడ్డట్టేనని ఎద్దేవా చేశారు.