కాంగ్రెస్ మాట నిలబెట్టుకోవాలి.. హరీష్ రావు డిమాండ్

వానాకాలం వచ్చినా, రైతులకు పంట పెట్టుబడి సాయం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని, బీఆర్ఎస్ హయాంలో వాన చినుకు పడిన వెంటనే రైతుబంధు పైసలు పడేవని గుర్తు చేశారు హరీష్ రావు.

Advertisement
Update:2024-06-09 21:52 IST

ఎన్నికలకు ముందు అన్ని పంటలకు రూ.500 బోనస్ ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్, ఇప్పుడు సన్న వడ్లకే బోనస్ అంటూ తిరకాసు పెట్టడం సరికాదన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాంగ్రెస్ ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని, రైతులను దగా చేయడం మంచిది కాదని హితవు పలికారు. అసెంబ్లీ సమావేశాల్లో అన్ని రకాల పంటలకు బోనస్ ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన పోరాటం చేస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని చిన్నచూపు చూస్తోందని మండిపడ్డారు హరీష్ రావు.

సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం అక్కేనపల్లి గ్రామంలో ఆయిల్ పామ్ మొట్ట మొదటి క్రాప్ కటింగ్ కార్యక్రమాన్ని హరీష్ రావు లాంఛనంగా ప్రారంభించారు. గతంలో ఇదే చోట హరీష్ రావు స్వయంగా మొక్కను నాటారు, ఇప్పుడు అదే ప్రాంతంలో ఆయన పంటను కోశారు. ఈ అవకాశం తనకు రావడం అదృష్టం అన్నారాయన. పంట పండినందుకు రైతుకు ఎంత ఆనందంగా ఉంటుందో, ఈ పంటను ఇక్కడ పరిచయం చేసిన ప్రజా ప్రతినిధిగా తనకు అంతే సంతోషంగా ఉందన్నారు హరీష్ రావు. ఆయిల్ పామ్ పంటపై గతంలో చాలా మంది రైతుల్లో అనుమానాలు ఉండేవని, ఏపీలోని రైతులు ఇదే పంట సాగుతో లాభపడుతుండగా.. ఇక్కడ కూడా సాగుకు భరోసా ఇచ్చి రైతన్నలకు గత ప్రభుత్వం అండగా నిలబడిందని, అందుకే ఇలాంటి అద్భుత ఫలితాలు వచ్చాయని చెప్పారు హరీష్ రావు. రాష్ట్రంలో 20 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు కోసం గత సీఎం కేసీఆర్ ప్రోత్సాహం అందించారన్నారు.


గత బీఆర్ఎస్ ప్రభుత్వ చొరవతో దేశంలోనే అతి పెద్దదైన ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ తెలంగాణలో ఏర్పాటవుతోందని చెప్పారు హరీష్ రావు. రూ.300 కోట్లతో 120 టన్నుల క్రషింగ్ సామర్థ్యంతో దీన్ని నిర్మించుకుంటున్నామని అన్నారు. వచ్చే ఏడాది ఏప్రిల్ నాటికి ఈ ఫ్యాక్టరీ ప్రారంభమవుతుందని ఆశభావం వ్యక్తం చేశారు. ఆయిల్ పామ్ సాగులో సిద్దిపేట ఆదర్శంగా నిలిచిందని, కోనసీమగా ఈ ప్రాంతం మారుతుందన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఆయిల్ పామ్ రైతులను చిన్నచూపు చూస్తోందని విమర్శించారు హరీష్ రావు. గత ప్రభుత్వంలో మెయింటెనెన్స్ కి ఏడాదికి రూ.4200 ఇచ్చామని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక అది కూడా ఆపేశారని అన్నారు. వెంటనే పెండింగ్ సొమ్ము విడుదల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వానాకాలం వచ్చినా, రైతులకు పంట పెట్టుబడి సాయం గురించి కాంగ్రెస్ ప్రభుత్వం నోరు మెదపడం లేదని, బీఆర్ఎస్ హయాంలో వాన చినుకు పడిన వెంటనే రైతుబంధు పైసలు పడేవని గుర్తు చేశారు. మేనిఫెస్టోలో చెప్పినట్టు పంట కాలానికి ముందే రైతు భరోసా డబ్బులు విడుదల చేయాలన్నారు హరీష్ రావు. రైతుల్ని మోసం చేయాలని చూస్తే అసెంబ్లీ వేదికగా పోరాటం చేస్తామన్నారాయన. 

Tags:    
Advertisement

Similar News