బోగస్‌ మాటలు కాదు.. బోనస్ ఇవ్వు రేవంత్ - హరీష్‌ రావు

కేసీఆర్ నల్గొండ పర్యటనలో రాజకీయాలు ఏం మాట్లాడలేదన్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు.

Advertisement
Update:2024-04-02 12:38 IST
బోగస్‌ మాటలు కాదు.. బోనస్ ఇవ్వు రేవంత్ - హరీష్‌ రావు
  • whatsapp icon

కాంగ్రెస్‌ ప్రభుత్వం అభద్రతా భావంలో ఉందన్నారు మాజీ మంత్రి హరీష్‌ రావు. సిద్దిపేట కలెక్టర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన హరీష్‌ రావు.. ఎండిపోయిన పంటలకు, వడగళ్ల వానలకు నష్టపోయిన పంటలకు ఎకరాకు రూ.25 వేల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. దాంతో పాటు ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఎకరాకు రూ. 15 వేల రైతు భరోసా, కౌలు రైతులకు ఎకరాకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12 వేలు ఇవ్వాలన్నారు.

200 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని చెప్తే.. ఉత్తమ్ కుమార్‌ రెడ్డి అవహేళనగా మాట్లాడుతున్నార‌ని మండిపడ్డారు హరీష్‌ రావు. రైతులను కాంగ్రెస్ ప్ర‌భుత్వం జోకర్లుగా చూస్తోందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం రైతు కేంద్రంగా పనులు చేసిందని గుర్తుచేశారు. బీఆర్ఎస్ అంటేనే భారత రైతు సమితి అనే విధంగా పనులు చేశామన్నారు. దేశంలోనే ఎక్కడలేని విధంగా రైతుబంధు, రైతు బీమా పథకాలు అమలు చేశామన్నారు హరీష్‌ రావు.

కేసీఆర్ నల్గొండ పర్యటనలో రాజకీయాలు ఏం మాట్లాడలేదన్నారు. కానీ కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఎగిరెగిరి పడుతున్నారని విమర్శించారు. బీఆర్ఎస్‌ను విమర్శించే నైతిక హక్కు కాంగ్రెస్ నేతలకు లేదన్నారు. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. కాంగ్రెస్ నేతలు రైతులను మోసం చేశారని మండిపడ్డారు హరీష్‌ రావు. రైతులకు ఇచ్చిన ఏ ఒక్క హామీని కాంగ్రెస్ నెరవేర్చలేదన్నారు.

సీఎం రేవంత్ రెడ్డి బోగస్ మాటలు బంద్ పెట్టి.. వరి, మొక్కజొన్న పంటలకు క్వింటాకు రూ.500 బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేశారు హరీష్‌ రావు. ఇప్పటికైనా పంట నష్టం అంచనా వేసి రైతులను ఆదుకోవాలన్నారు. ఆ దిశగా అధికారులకు ఆదేశాలివ్వాలన్నారు. 

Tags:    
Advertisement

Similar News