మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓటుతో కరిగించండి
హైదరాబాద్ కు మల్కాజ్ గిరి సెగ్మెంట్ గుండెకాయ వంటిందన్నారు మంత్రి హరీష్ రావు. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓటుతో కరిగించాలని స్థానికులకు ఆయన పిలుపునిచ్చారు. మైనంపల్లిలా తాను దిగజారి మాట్లాడలేనన్నారు.
బీఆర్ఎస్ లో మైనంపల్లి గొడవ అందరికీ తెలిసిందే. మల్కాజ్ గిరి టికెట్ ఇచ్చినా కూడా కొడుక్కి మెదక్ సీటు ఆశించి హన్మంతరావు ఏకంగా పార్టీ మారారు. పార్టీ మారే సమయంలో మంత్రి హరీష్ రావుపై తీవ్ర విమర్శలు చేశారు. అయితే అప్పటికప్పుడు మంత్రి సంయమనం పాటించినా, మైనంపల్లికి గట్టి గుణపాఠం చెప్పాలని డిసైడ్ అయ్యారు. తండ్రీకొడుకులిద్దర్నీ ఓడించేందుకు ఆ రెండు నియోజకవర్గాలపై కూడా ఫోకస్ పెంచారు. తాజాగా మల్కాజ్ గిరిలో మంత్రి హరీష్ రావు ప్రచారం చేపట్టారు. మైనంపల్లిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.
హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందిందని ప్రముఖులు ప్రశంసిస్తున్నారని, హైదరాబాద్ కు మల్కాజ్ గిరి సెగ్మెంట్ గుండెకాయ వంటిందన్నారు మంత్రి హరీష్ రావు. మైనంపల్లి డబ్బు మైనాన్ని ఓటుతో కరిగించాలని స్థానికులకు ఆయన పిలుపునిచ్చారు. మైనంపల్లిలా తాను దిగజారి మాట్లాడలేనన్నారు. ఓటుతో ప్రజలే మైనంపల్లికి తగిన గుణపాఠం చెప్పాలన్నారు.
ఇటీవల మైనంపల్లి హన్మంతరావు వ్యాఖ్యలు వైరల్ గా మారాయి. మంత్రి మల్లారెడ్డిపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో హరీష్ రావుపై కూడా మరోసారి మాటలు తూలారు. దీనికి బదులుగా ఇప్పుడు హరీష్ రావు, మల్కాజ్ గిరిలో మైనంపల్లికి షాకివ్వబోతున్నారు. ఆ నియోజకవర్గంలో సుడిగాలి పర్యటన చేస్తున్న హరీష్, బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డిని గెలిపించాలని ప్రచారం చేస్తున్నారు. రాజశేఖర్ రెడ్డి కోరితే మల్కాజ్ గిరిని తాను దత్తత తీసుకుంటానన్నారు. రాజశేఖర్ రెడ్డి చేతిలో మైనంపల్లి ఓడిపోవడం ఖాయమన్నారు.