ముగ్గురి ప్రాణాలు తీసిన వరకట్న పిశాచి..! - వేధింపులు తాళలేక బిడ్డలతో సహా వివాహిత ఆత్మహత్య
గణేష్, సౌందర్యలు ఉప్పల్‌లోని భరత్ నగర్‌లో నివాసముంటున్నారు. పద్మారావునగర్ లోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్న గణేశ్.. పెళ్లయిన తర్వాత అదనపు కట్నం తీసుకురమ్మంటూ భార్యను వేధించసాగాడు.
ఆ వ్యక్తి నరనరానా ఆవహించిన వరకట్న పిశాచి.. కోరలు చాచింది. కట్టుకున్న భార్య.. కన్నబిడ్డల కంటే.. అతనికి కాసులే ఎక్కువయ్యాయి. అదనపు కట్నం కోసం పెళ్లయిన తర్వాత నుంచి భార్యను వేధిస్తూనే ఉన్నాడు. పెళ్లి చేసుకునే ముందు నచ్చిన అమ్మాయిని.. ఆ తర్వాత అందంగా లేవంటూ చులకన చేశాడు.. చివరికి ఆమెతో సహా కన్న బిడ్డల ప్రాణాలు పోవడానికి కారకుడయ్యాడు. సికింద్రాబాద్‌లోని బన్సీలాల్‌పేట్‌లో సోమవారం ఓ వివాహిత తన కవల పిల్లలతో కలసి బలవన్మరణానికి పాల్పడిన ఘటన స్థానికుల హృదయాలను కలచివేసింది. ఈ ఘటనకు సంబంధించి గాంధీనగర్ ఇన్‌స్పెక్టర్ మోహన్ రావు, బాధితులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
నలుగురు కుమార్తెలు.. ఉన్నంతలో ఘనంగా వివాహాలు..
సిద్ధిపేట జిల్లా రామంచకు చెందిన వేమన్న, దుర్గమ్మ దంపతులు 30 ఏళ్ల క్రితం హైదరాబాదుకు వలసవచ్చారు. ప్రస్తుతం బన్సీలాల్‌పేట్ డివిజన్ జీవైఆర్ కాంపౌండ్ డబుల్ బెడ్ రూమ్ కాలనీలో నివసిస్తున్నారు. వారికి నలుగురు కుమార్తెలు. ప్రయివేటు ఉద్యోగం చేస్తున్న వేమన్న పిల్లల పెళ్లీళ్లను ఉన్నంతలో ఘనంగా చేశారు. మూడేళ్లక్రితం చిన్న కూతురు సౌందర్య(26)ను సిద్దిపేట జిల్లా కొండాపూర్‌కు చెందిన గణేశ్‌కి ఇచ్చి వివాహం జరిపించాడు. ఆ సందర్భంగా రూ.2.5 లక్షల నగదు, 4 తులాల బంగారం కానుకగా ఇచ్చాడు.
గణేష్, సౌందర్యలు ఉప్పల్‌లోని భరత్ నగర్‌లో నివాసముంటున్నారు. పద్మారావునగర్ లోని ఓ సెలూన్‌లో పనిచేస్తున్న గణేశ్.. పెళ్లయిన తర్వాత అదనపు కట్నం తీసుకురమ్మంటూ భార్యను వేధించసాగాడు. ఏడాదిన్నర క్రితం సౌందర్య కవల పిల్లలకు (పాప, బాబు) జన్మనిచ్చినా భర్త వేధింపులు ఆగలేదు. పలుమార్లు పుట్టింటి నుంచి అడిగినంత సొమ్ము తీసుకొచ్చినా అతను మారలేదు. పైగా అందంగా లేవంటూ హింసించేవాడు.
ఇల్లు తన పేరిట రాయించాలని ఒత్తిడి..
సౌందర్య తల్లిదండ్రులకు ప్రభుత్వమిచ్చిన డబుల్ బెడ్రూమ్ ఇల్లును తన పేరిట రాయించాలంటూ భార్యను గణేశ్ ఒత్తిడి చేసేవాడు. యాదాద్రి సమీపంలోని స్థలాన్ని సౌందర్య పేరిట రిజిస్ట్రేషన్ చేయించినా సంతృప్తి పడలేదు. దాంతో సౌందర్య 25 రోజుల క్రితం పిల్లలతోసహా పుట్టింటికి చేరింది. అయినా ఆమెను ఫోన్ ద్వారా భర్త వేధించేవాడు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో గాంధీనగర్ పోలీసులు అతనిపై కేసు నమోదు చేశారు.
వేడుకున్నా.. కనికరించలేదు..
సోమవారం ఉదయం 11 గంటలకు భర్త పనిచేస్తున్న పద్మారావునగర్‌లోని దుకాణానికి వెళ్లిన సౌందర్య... తనను కాపురానికి తీసుకెళ్లాలంటూ వేడుకుంది. అయినా అతను కరగలేదు. దీంతో జీవితంపై విరక్తి చెందిన సౌందర్య.. బన్సీలాల్‌పేటకు తిరిగొచ్చింది.. ఇంట్లో తల్లి నిద్రపోతున్న సమయంలో ఇద్దరు పిల్లలతో 8వ అంతస్తు పైకి వెళ్లింది. పిల్లలతో పాటు కిందకి దూకేసింది. దీంతో ముగ్గురూ ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న గాంధీనగర్ పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. సౌందర్య తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. సమాచారం అందుకున్న మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ వచ్చి బాధితులను పరామర్శించారు. వారికి అండగా నిలుస్తామని, ఆదుకుంటామని హామీ ఇచ్చారు.