నిందలు, శాపనార్థాలు.. బీఆర్ఎస్ పై గుత్తా ఘాటు వ్యాఖ్యలు

ఉద్యమకారుల పేరుతో పార్టీలోకి వచ్చిన చాలామంది ఆ తర్వాత కోటీశ్వరులయ్యాయరని, నల్లగొండ జిల్లాలో కొందరు లిల్లీపుట్‌లను తయారుచేశారని విమర్శించారు గుత్తా.

Advertisement
Update:2024-04-21 17:11 IST

శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి బీఆర్ఎస్ కి దూరమవుతున్నారనే వార్తలు నిజం కాబోతున్నాయి. సొంత పార్టీపై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్నందువల్ల తనకు రాజకీయ పార్టీలతో సంబంధం లేదన్నారాయన. పార్టీ వీడిన ఎమ్మెల్సీలపై అనర్హత వేటు విషయంలో న్యాయపరమైన, అధికార సమీక్ష తర్వాతే చట్ట ప్రకారమే నిర్ణయం తీసుకుంటామన్నారు. అంటే కాంగ్రెస్ లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీల విషయంలో ఆయన కఠిన చర్యలు తీసుకునే అవకాశాలు లేవని తేలిపోయింది. పరోక్షంగా ఆయన కాంగ్రెస్ కి ఆ ఉపకారం చేసిబెట్టబోతున్నట్టు స్పష్టమైంది.

బీఆర్ఎస్ పై విమర్శలు..

ఏకపక్షంగా, మనం ఎవరిని నిలబెట్టినా గెలుస్తామనే అహంకారంతో వ్యవహరించడం వల్లనే బీఆర్‌ఎస్‌ అధికారాన్ని కోల్పోయిందని విమర్శించారు గుత్తా సుఖేందర్‌రెడ్డి. బీఆర్‌ఎస్‌ లో సమన్వయ లోపం ఉందని, బాధ్యతలు సరైన పద్ధతిలో లేవని అన్నారు. అసలు పార్టీకి నిర్మాణమే లేదని ఘాటు వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలే సీఎం అనే పరిస్థితులు బీఆర్ఎస్ హయాంలో ఉండేవని, ఎంపీలకు అంత సీన్ ఉండేది కాదని, ఇక ఎమ్మెల్సీలను మరీ కరివేపాకుల్లో తీసిపారేసేవారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఉద్యమకారుల పేరుతో పార్టీలోకి వచ్చిన చాలామంది ఆ తర్వాత కోటీశ్వరులయ్యాయరని, నల్లగొండ జిల్లాలో కొందరు లిల్లీపుట్‌లను తయారుచేశారని విమర్శించారు గుత్తా. పల్లీ,బఠానీలు అమ్ముకునే నేతలు కూడా కోట్లకు పడగలెత్తారన్నా రు. తనను విమర్శించే బీఆర్‌ఎస్‌ నేతలు ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలన్నారు. త్వరలో వారి బండారం బయటపెడతానని హెచ్చరించారు. ఖజానా ఖాళీగా ఉండడంతో కనీసం ఏడాదైనా కాంగ్రెస్ ప్రభుత్వానికి టైమివ్వాలని సింపతీ చూపించారు.

మొత్తానికి గుత్తా సుఖేందర్ రెడ్డి తన ప్రయాణం ఎటువైపో హింటిచ్చేశారు. కాంగ్రెస్ లోకి ఇప్పటికిప్పుడు వెళ్లకపోయినా ఆయన బీఆర్ఎస్ కి మాత్రం దూరమయ్యారు. త్వరలో కాంగ్రెస్ లోకి వెళ్తానని పరోక్షంగా తేల్చి చెప్పారు. 

Tags:    
Advertisement

Similar News