గురుకులాలు.. ర్యాంకుల ఖజానాలు..

దేశంలో తొలిసారి రెసిడెన్షియల్ లా కాలేజీని తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించింది, పీజీ కాలేజీలు కూడా ప్రారంబించింది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వకపోయినా, గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ప్రారంభించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నారు.

Advertisement
Update:2022-09-14 21:50 IST

తెలంగాణలో గురుకుల విద్యార్థులు అదరగొట్టారు. ఐఐటీ, నీట్, జేఈఈ లో సత్తా చాటారు. కార్పొరేట్ విద్యాసంస్థలకు ధీటుగా ర్యాంకులు తెచ్చుకున్నారు. ఈ ర్యాంకర్లను రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా సన్మానించింది. తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ సొసైటీ ఆధ్వర్యంలో ర్యాంకర్లను నాయకులు, అధికారులు అభినందించారు. మంత్రులు కొప్పుల ఈశ్వర్, హరీష్ రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్, గురుకుల సొసైటీ సెక్రెటరీ రొనాల్డ్ రాస్, గోట్ అండ్ షీప్ కార్పొరేషన్ చైర్మన్ బాలరాజు యాదవ్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

గతంలో రెసిడెన్షియల్ స్కూళ్లలో అడ్మిషన్లు తీసుకునేందుకు ఎవరూ ముందుకు వచ్చేవారు కాదని, తెలంగాణ ఏర్పాటు తర్వాత గురుకులాలపై ప్రజలకు గురి కుదిరిందని, ప్రస్తుతం 5 లక్షలమంది విద్యార్థులు గురుకులాల్లో చదువుకుంటున్నారని చెప్పారు మంత్రి కొప్పుల ఈశ్వర్. ఈ ఏడాది ఐఐటీ, నీట్, జేఈఈలో 657 మంది విద్యార్ధులు అత్యుత్తమ ర్యాంకులు సాధించారని, సెంట్రల్ యూనివర్సిటీలో 400 మంది అడ్మిషన్లు పొందారని తెలిపారు. విద్యార్ధులను ప్రోత్సహించిన సిబ్బందిని, తల్లిదండ్రులను కూడా మంత్రి కొప్పుల ఈశ్వర్ అభినందించారు. సీఎం కేసీఆర్ ముందు చూపు వల్ల గురుకుల విద్య గుణాత్మకంగా మారిందని తెలిపారు.

ఒకప్పుడు పేదవారి స్కూళ్లుగా పేరుపడిన గురుకులాలు ఇప్పుడు పెద్దింటివారి పిల్లలకు సాధ్యం కాని ర్యాంకుల కర్మాగారాలుగా మారాయని చెప్పారు మంత్రి హరీష్ రావు. లక్షల ఖర్చుతో కార్పొరేట్ స్కూళ్లలో చదివే పిల్లలతో పోటీపడి గురుకుల విద్యార్థులు ర్యాంకులు సాధిస్తున్నారని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం కల్పించిన అవకాశం వల్ల, ప్రిన్సిపల్, టీచర్ల కృషి వల్ల ఇది సాధ్యమైందని చెప్పారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు కేవలం 42 ర్యాంకులు మాత్రమే వస్తె, ఇప్పుడు ఆ సంఖ్య 1312 కు పెరిగిందని అన్నారు. తెలంగాణ ఏర్పాటుకు ముందు 134 గురుకుల కాలేజీలు ఉంటే ఇప్పుడు వాటి సంఖ్య 268 ఉందని గుర్తు చేశారాయన. గతంలో గురుకుల కాలేజీలు అందుబాటులో లేక పదో తరగతి తర్వాత పనులకు వెళ్లేవారని, ఇప్పుడు గురుకులాలను జూనియర్ కాలేజీలుగా అప్ గ్రేడ్ చేసిన తర్వాత పేద విద్యార్థులకు డాక్టరు, ఇంజినీర్ అయ్యే అవకాశం కలిగిందని అన్నారు హరీష్ రావు.

సమాజానికి తిరిగివ్వండి..

రేపటి తరం మీద పెట్టే పెట్టుబడి, అద్భుత సంపదగా సీఎం కేసీఆర్ భావించారని, విద్యార్థుల కోసం చేసే ఖర్చును కూడా క్యాపిటల్ ఎక్స్ పెండిచర్ గా భావించారని అందుకే ఈ ఫలితాలు వచ్చాయని చెప్పారు హరీష్ రావు. ఇంటర్ తర్వాత కూడా ఇబ్బంది లేకుండా 30 డిగ్రీ కాలేజీలను ప్రత్యేకంగా ప్రారంభించామని తెలిపారు. దేశంలో తొలిసారి రెసిడెన్షియల్ లా కాలేజీని కూడా తెలంగాణ ప్రభుత్వం ప్రారంభించిందని, పీజీ కాలేజీలు కూడా ప్రారంబించామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి సైనిక్ స్కూల్ ఇవ్వకపోయినా, గురుకులాల సొసైటీ ఆధ్వర్యంలో సైనిక్ స్కూల్ ప్రారంభించి ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ లో చేరాలనే విద్యార్థుల కలను సాకారం చేస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం, తెలంగాణ సమాజం మీకు ఎంతో ఇచ్చింది, మీరు మంచి స్థాయికి చేరుకుని, తిరిగి సమాజానికి ఎంతో కొంత ఇవ్వాలి. మీ ఊరుకో, మీ స్నేహితులకో, గురుకుల సొసైటీకో ఏదో విధంగా తిరిగి ఇవ్వాలి అంటూ ర్యాంకర్లకు సూచించారు మంత్రి హరీష్ రావు.

Tags:    
Advertisement

Similar News