తెలంగాణలో రెట్టింపైన జీఎస్టీ రాబడి.. ఐదేళ్లలో రూ.12,413 కోట్ల పెరుగుదల

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.11,639 కోట్ల జీఎస్టీ వసూలైంది. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.24,052 కోట్ల జీఎస్టీ వచ్చింది.

Advertisement
Update:2023-09-10 05:21 IST

తెలంగాణ రాష్ట్రం అతి కొద్ది కాలంలోనే బలమైన ఆర్థిక శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రం ఏర్పడి 9 ఏళ్లే అయినా.. చిన్న రాష్ట్రమైన తెలంగాణ పెద్ద రాష్ట్రాలతో పోటీ పడుతోంది. రాష్ట్రంలోని వాణిజ్య పన్నుల శాఖపై ప్రత్యేక శ్రద్ద పెట్టి.. పన్ను వసూళ్లు, అవగాహన కల్పించడం వంటి విషయాలపై దృష్టి కేంద్రీకరించింది. వాణిజ్య పన్నుల శాఖలో రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త సంస్కరణలతో అనూహ్యమైన ఫలితాలు వస్తున్నాయి. రాష్ట్రంలో పన్ను రాబడి గణనీయంగా పెరిగింది. ఎవరూ ఊహించని విధంగా జీఎస్టీ వసూళ్లు గణనీయమైన వృద్ధి రేటు సాధించాయి.

2019-20 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.11,639 కోట్ల జీఎస్టీ వసూలైంది. అదే 2023-24 ఆర్థిక సంవత్సరంలో ఆగస్టు వరకు రూ.24,052 కోట్ల జీఎస్టీ వచ్చింది. అంటే కేవలం ఐదేళ్లలోనే జీఎస్టీ వసూళ్లు రెట్టింపు అయ్యాయి. 2019-20 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో వసూలైన జీఎస్టీ రూ.12,413 కోట్లు ఎక్కువ. జీఎస్టీ వసూళ్లలో తెలంగాణ ప్రభుత్వం ఆశించిన ఫలితాలే మొదటి నుంచి వస్తున్నాయి. ఒక పక్క ప్రపంచమంతా కరోనా కారణంగా ఆర్థికంగా ఎంతో నష్టపోయింది. ఆ ఏడాది (2020-21) ఆగస్టు వరకు తెలంగాణలో కేవలం రూ.8,224 కోట్ల జీఎస్టీ మాత్రమే వసూలైంది. కానీ ఆ తర్వాత జీఎస్టీ వసూళ్లు తిరిగి గాడిన పడ్డాయి.

కరోనా తర్వాతి ఏడాది ఆగస్టు వరకు రూ.12,451 కోట్లు.. 2022-23లో ఆగస్టు వరకు రూ.16,461 కోట్లు వసూలు అయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం తొలి ఐదు నెలల్లో అనూహ్యమైన వసూళ్లను సాధించింది. ఐదు నెలల్లో రూ.24,052 కోట్లు వసూలైంది. ఇది గతేడాదితో పోలిస్తే రూ.7,720 కోట్ల అధికం. తెలంగాణ ఇప్పుడు సొంత కాళ్లపై నిలబడుతూ బలమైన ఆర్థిక పునాదిని వేసుకుంటోంది.

జీఎస్టీ వసూళ్లలో ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల నుంచే దూకుడు ప్రదర్శించింది. ఏప్రిల్ నెలలో రూ.5,622 కోట్లు, మే నెలలో రూ.4,507 కోట్లు, జూన్‌లో రూ.4,681కోట్లు, జూలైలో రూ.4,849 కోట్లు, ఆగస్టులో రూ.4,393 కోట్లు వసూలు అయ్యింది. 2023-24లో జీఎస్టీ రూపంలో రూ.50,942 కోట్లు వస్తాయని అంచనా వేయగా.. మొదటి ఐదు నెలల్లోనే రూ.24,052 కోట్ల రాబడి వచ్చింది. బడ్జెట్ అంచనాల్లో ఇప్పటికే 47 శాతం ఆదాయం వచ్చింది. ఇక మిగిలిన 7 నెలల్లో ఇదే దూకుడు ప్రదర్శిస్తే బడ్జెట్ అంచనాలను దాటి జీఎస్టీ వసూళ్లు వస్తాయని అధికారులు భావిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News