గృహజ్యోతి పథకానికి బ్రేక్..!

నేటి నుంచి బిల్లింగ్ రీడింగ్‌తో పాటు రేషన్ కార్డు,ఆధార్, సెల్‌ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలని మీటర్‌ రీడర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.

Advertisement
Update:2024-02-06 11:40 IST

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న గృహజ్యోతి పథకం అమలుకు ఆదిలోనే ఆటంకం ఏర్పడింది. మీటర్ రీడర్లు రివర్స్ కావడంతో పథకం అమలుకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. ఈరోజు నుంచి గృహజ్యోతి రిజిస్ట్రేషన్స్ మొదలువుతుందని రేవంత్ సర్కారు ప్రకటించింది. 200 యూనిట్ల వరకు ఫ్రీ కరెంట్‌ అందజేస్తామని తెలిపింది. క్షేత్రస్థాయిలో లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ నేటి నుంచే ప్రారంభం అవుతుందని పేర్కొంది. ప్రతినెల మొదటివారంలో 10రోజుల పాటు మీటర్‌ రీడింగ్‌తో పాటు లబ్ధిదారుల గుర్తింపు ఉంటుందని చెప్పింది. మీటర్‌ రీడింగ్‌ తీసే సిబ్బందితోనే లబ్ధిదారులను గుర్తించాలని నిర్ణయించింది. మీటర్‌ రీడర్‌కు రేషన్‌, ఆధార్‌ కార్డ్‌ నంబర్లతో పాటు, మొబైల్‌ నంబర్‌ వివరాలు అందజేయాలని కోరింది.

మీటర్‌ రీడర్ల డిమాండ్లు ఏంటంటే..

నేటి నుంచి బిల్లింగ్ రీడింగ్‌తో పాటు రేషన్ కార్డు,ఆధార్, సెల్‌ఫోన్ నెంబర్ ఎంట్రీ చేయాలని మీటర్‌ రీడర్లకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. అయితే సర్కారు ఆదేశాలపై మీటర్‌ రీడర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. తమకు పనిభారం పెరుగుతుంది కాబట్టి అదనంగా డబ్బులు చెల్లిస్తేనే పనిచేస్తామని మీటర్ రీడర్లు చెబుతున్నారు. పనికి తగ్గ వేతనం చెల్లించాల్సిందే అని డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పష్టమైన హామీ వచ్చేవరకు రీడింగ్‌లు తీసేది లేదని తెగేసి చెబుతున్నారు. ఈ నేపథ్యంలో గృహజ్యోతి పథకం అమలుపై సందిగ్ధత నెలకొంది. మీటర్ రీడర్ల డిమాండ్‌పై ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది.

Tags:    
Advertisement

Similar News