గ్రూప్-2 ఫలితాలు వేగంగా ఇస్తాం
సర్వీస్ కమిషన్ పై నమ్మకం ఉంచి పరీక్షలు రాయాలని కోరిన టీజీపీఎస్సీ ఛైర్మన్
ఆదివారం, సోమవారం జరగనున్న గ్రూప్-2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు టీజీపీఎస్సీ ఛైర్మన్ బుర్రా వెంకటేశం తెలిపారు. పది రోజులుగా అన్ని అంశాలను సమీక్షించామని చెప్పారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో జరుగుతాయని.. సర్వీస్ కమిషన్ పై నమ్మకం ఉంచి పరీక్షలు రాయాలని కోరారు. నాంపల్లి టీజీపీఎస్సీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు.
గ్రూప్ 2 పరీక్షలకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు. అభ్యర్థులు ఎలాంటి అపోహలు, అనుమానాలు పెట్టుకోవద్దన్నారు. మెరిట్ ఉంటే మిమ్మల్ని ఎవరూ ఆపలేరని తెలిపారు. 5.51 లక్షల మందికి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. ప్రతి ఒక్కరికీ బయోమెట్రిక్ తప్పనిసరి అన్నారు. ప్రశ్నాపత్రాలకు సంబంధించి 58 స్టోరేజ్ పాయింట్లు పెట్టాం. అభ్యర్థికి తప్ప ప్రశ్నాపత్రం ఎవరికీ తెలిసే అవకాశం లేదు. 2015లో గ్రూప్-2 నోటిఫికేషన్ అమలుకు చాలా సమయం తీసుకున్నారు. ఈసారి వేగంగా ఫలితాలు ఇస్తామని బుర్రా వెంకటేశం తెలిపారు.