గ్రూప్-1పై నేడు హైకోర్టులో విచారణ
ఫలితాలకు ముందే తుది విచారణ ముగించాలని సుప్రీంకోర్టు సూచన నేపథ్యంలో తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ
వివాదాలమయంగా మారిన గ్రూప్-1పై హైకోర్టు బుధవారం విచారించనున్నది. మొత్తం నాలుగు కేసులు ధర్మాసనం ముందు విచారణకు రానున్నాయి. జీవో 29, ట్రాన్స్‌జెండర్ రిజర్వేషన్, లోకల్, నాన్‌లోకల్ అంశాలపై అభ్యర్థులు వేసిన పిటిషన్లను హైకోర్టు డివిజన్ బెంచ్ విచారించనున్నది. ఇప్పటికే గ్రూప్-1 మెయిన్స్ పరీక్షలు ముగిశాయి. బుధవారం హైకోర్టు విచారణ నేపథ్యంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే కొన్ని అంశాలపై వాదనలు ముగియగా.. కోర్టు తీర్పు తమకే అనుకూలంగా వస్తుందని పిటిషనర్లు అభిప్రాయపడుతున్నారు.
సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా రాష్ట్ర ప్రభుత్వం జీవో 29 తెచ్చిందని, ఇది రాజ్యాంగస్ఫూర్తికి, రూల్ ఆఫ్ రిజర్వేషన్‌కు వ్యతిరేకమని దీనివల్ల ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులకు అన్యాయం జరుగుతున్నదని సుప్రీంకోర్టులో అభ్యర్థుల తరఫున న్యాయవాది తెలిపారు. పరీక్షపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిందని రాష్ట్ర ప్రభుత్వం తరఫున న్యాయవాది చెప్పారు. ఇరువురి వాదనలు విన్న సుప్రీంకోర్టు గ్రూప్-1 మెయిన్స్ పరీక్ష నిలుపుదల కుదరదని స్పష్టం చేసింది. అయితే ఫలితాల విడుదలకు ముందే తుది విచారణ ముగించాలని హైకోర్టుకు సూచించింది. ఈ నేపథ్యంలో హైకోర్టు తీర్పు ఎలా ఉండబోతున్నదనే ఉత్కంఠ నెలకొన్నది.