గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష యధాతథం.. స్టే ఇచ్చేందుకు నిరాకరించిన హైకోర్టు

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయలేమని జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం స్పష్టం చేసింది.

Advertisement
Update:2023-05-25 18:28 IST

గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహణపై స్టే ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్‌పీఎస్సీ) జూన్ 11న గ్రూప్-1 పరీక్ష నిర్వహిస్తామని ప్రకటించింది. నిరుడు అక్టోబర్‌లో గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించారు. అయితే పేపర్ లీక్ వ్యవహారం బయటకు రావడంతో అప్పట్లో నిర్వహించిన పరీక్షను పూర్తిగా రద్దు చేశారు. తిరిగి జూన్ 11న పరీక్ష నిర్వహించనున్నట్లు కమిషన్ ప్రకటించింది.

కాగా, పరీక్ష నిర్వహణను వాయిదా వేయాలంటూ 36 మంది అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. గురువారం ఉదయం ఈ పిటిషన్ జస్టిస్ కే.లక్ష్మణ్ బెంచ్‌కు విచారణకు వచ్చింది. అయితే తన కుమార్తె కూడా గ్రూప్-1 పరీక్ష రాస్తున్నందున ఈ పిటిషన్‌ను విచారించలేనని తెలిపారు. దీంతో హైకోర్టు ఈ పిటిషన్‌ను జస్టిస్ పుల్లా కార్తీక్‌ బెంచ్‌కు బదిలీ చేసింది. జస్టిస్ కార్తీక్ బెంచ్ మధ్యాహ్నం ఈ పిటిషన్‌ను విచారించింది.

కమిషన్ నిర్వహించే వివిధ పోస్టులకు వేర్వేరు నోటిఫికేషన్లు జారీ చేసినప్పుడు సంబంధిత పరీక్షల మధ్య 2 నెలల వ్యవధి ఉండాలనే నిబంధనను అమలు చేయాల్సిన అవసరం ఉందని.. కానీ దీనిని పట్టించుకోకుండా గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షకు కమిషన్ నోటిఫికేషన్ జారీ చేయడం చట్ట విరుద్దమని అభ్యర్థులు తమ పిటిషన్‌లో పేర్కొన్నారు. పలు పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నందు వల్ల గ్రూప్-1 ప్రిలిమ్స్‌ను రెండు నెలల పాటు వాయిదా వేయాలని కోరారు.

అయితే, గ్రూప్-1 ప్రిలిమ్స్ పరీక్షను వాయిదా వేయలేమని జస్టిస్ పుల్లా కార్తీక్ ధర్మాసనం స్పష్టం చేసింది. 2 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్‌ను దృష్టిలో ఉంచుకొని పరీక్షలను వాయిదా వేయలేమని చెప్పింది. కాగా, అభ్యర్థులు లేవనెత్తిన అంశాలపై వివరణ ఇవ్వాలని టీఎస్‌పీఎస్సీ చైర్మన్, కార్యదర్శి, హోం శాఖ కార్యదర్శి, కేసు విచారిస్తున్న సిట్‌కు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను నాలుగు వారాల పాటు వాయిదా వేసింది.

Tags:    
Advertisement

Similar News