పరువు దక్కినట్టే.. పట్టభద్రుల ఓటు కాంగ్రెస్ కే
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు సాగింది.
వరంగల్- ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో కాంగ్రెస్ పరువు దక్కింది. ఆ పార్టీ మద్దతుతో బరిలో దిగిన చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్న విజయం సాధించారు. ఓట్ల లెక్కింపు తీవ్ర ఉత్కంఠరేపగా.. శుక్రవారం అర్థరాత్రి దాటిన తర్వాత రిటర్నింగ్ ఆఫీసర్ నుంచి ఆయన ధృవీకరణ పత్రం అందుకున్నారు.
ఎలిమినేషన్ ఓట్లతో గెలుపు..
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థి తీన్మార్ మల్లన్న, బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి మధ్య హోరాహోరీగా పోరు సాగింది. బుధవారం ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓట్ల లెక్కింపు శుక్రవారం అర్ధరాత్రి వరకు కొనసాగడం విశేషం. మూడు రోజుల పాటు ఉత్కంఠగా సాగిన ఈ లెక్కింపు ప్రక్రియలో తొలి ప్రాధాన్య ఓట్ల లెక్కింపుతో విజేత ఎవరనేది తేలలేదు. ఆ తర్వాత రెండో ప్రాధాన్య ఓట్ల లెక్కింపు, ఎలిమినేషన్ ప్రక్రియ చేపట్టగా చివరకు మల్లన్న గెలిచినట్టు తేలింది.
నైతిక విజయం నాదే..
ఈ ఎన్నికల్లో సాంకేతికంగా కాంగ్రెస్ గెలిచినా, నైతిక విజయం మాత్రం తనదేనంటున్నారు బీఆర్ఎస్ బలపరచిన అభ్యర్థి రాకేష్ రెడ్డి. ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో అధికార పార్టీ తరపున 32 మంది ఎమ్మెల్యేలు, ఐదుగురు మంత్రులున్నారని.. అయినా వారి అభ్యర్థికి తాను గట్టి పోటీ ఇచ్చానన్నారు. ఓడినా ప్రజల మధ్యనే ఉంటానని చెప్పుకొచ్చారు రాకేష్ రెడ్డి. తనకు అవకాశం ఇచ్చిన కేసీఆర్‌కు, పార్టీ నాయకులకు, ఓటు వేసిన పట్టభద్రులకు కృతజ్ఞతలు తెలిపారు. ప్రజల్లోనే ఉంటానని, బీఆర్ఎస్ తరపున ప్రజా సంక్షేమం కోసం ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తానన్నారు రాకేష్ రెడ్డి.