దమ్ముంటే ఫార్ములా -ఈ పై అసెంబ్లీలో చర్చ పెట్టండి

సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్‌ లేఖ.. స్పీకర్‌ కు బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేల విజ్ఞప్తి

Advertisement
Update:2024-12-18 16:28 IST

దమ్ముంటే ఫార్ములా - ఈ రేస్‌ రేస్‌ పై అసెంబ్లీలో చర్చ పెట్టాలని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ డిమాండ్‌ చేశారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వంపై, వ్యక్తిగతంగా తనపై ప్రస్తుత కాంగ్రెస్‌ ప్రభుత్వం కొన్ని నెలలుగా నిరాధార ఆరోపణలు చేస్తోందని.. నిజాలేమిటో తేలాలంటే అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరారు. ఈమేరకు సీఎం రేవంత్‌ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. కేబినెట్‌ సమావేశంలోనే ఫార్ములా -ఈ రేస్‌ తో పాటు తనపై గంటన్నర చర్చ జరిగినట్టుగా వార్త కథనాలు వచ్చాయని, ఈ అంశంపై నాలుగు గోడల మధ్య చర్చ కన్నా అసెంబ్లీలో చర్చ జరిగితే కోట్లాది మంది ప్రజలకు నిజానిజాలు ఏమిటో తెలుస్తాయన్నారు. తెలంగాణ రాష్ట్రానికి, హైదరాబాద్‌కు మంచి జరగాలనే ఉద్దేశంతోనే గత ప్రభుత్వం ఫార్ములా-ఈ రేస్ నిర్వాహకులతో ఒప్పందం చేసుకుందని తెలిపారు. ఈ రేస్ వల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు సుమారు రూ.700 కోట్ల రూపాయల లబ్ధి చేకూరిందని నీల్సన్ సంస్థ నివేదిక స్పష్టం చేస్తోందన్నారు.

2024లో రెండో దఫా రేస్ జరగాల్సిన సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని, వచ్చిన వెంటనే ఏకపక్షంగా రేస్‌ రద్దు చేసిందన్నారు. అప్పటి నుంచి రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగా ఈ రేస్ గురించి అనేక అవాస్తవాలను మీడియా ద్వారా ప్రచారం చేస్తున్నారని అన్నారు. ఫార్ములా-ఈ రేస్ ఒప్పందం, చెల్లింపులు పారదర్శకంగానే జరిగాయని తాను ఇదివరకే నేను వివరంగా చెప్పానని, అయినా ప్రభుత్వం తనపై దుష్ప్రచారం మానడం లేదన్నారు. ఈ విషయంలో నిజాలేమిటో తెలుసుకునే హక్కు రాష్ట్ర ప్రజలకు ఉందన్నారు. వాస్తవాలేమిటో ప్రజలకు తెలియజెప్పేందుకు అసెంబ్లీలో చర్చ పెట్టాలని కోరారు. ఈ అంశంపై అసెంబ్లీలో చర్చించాలని కోరుతూ మాజీ మంత్రులు హరీశ్‌ రావు, వేముల ప్రశాంత్‌ రెడ్డి, చామకూర మల్లారెడ్డి, ఎమ్మెల్యేలు కాలేరు వెంకటేశ్‌, కేపీ వివేకానంద, కల్వకుంట్ల సంజయ్‌, విజేయుడు, మాణిక్‌ రావు, పల్లా రాజేశ్వర్‌ రెడ్డి, చింత ప్రభాకర్‌ స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌ కుమార్‌ ను కోరారు. అసెంబ్లీ ఆవరణలోని స్పీకర్‌ చాంబర్‌లో స్పీకర్‌ ను కలిసి లేఖను అందజేశారు. ప్రభుత్వానికి అనుకూలంగా ఉన్న రోజే ఈ అంశంపై చర్చకు అనుమతించాలని విజ్ఞప్తి చేశారు.




Tags:    
Advertisement

Similar News