రూ.110 కోట్లతో ఇందిర మహిళా శక్తి భవనాల నిర్మాణం
పరిపాలన అనుమతులు మంజూరు చేసిన ప్రభుత్వం
రాష్ట్రంలోని 22 జిల్లాల్లో ఇందిర మహిళా శక్తి భవనాల నిర్మాణానికి ప్రభుత్వం పరిపాలన అనుమతులు ఇచ్చింది. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో ఈ భవనాలు నిర్మించనున్నారు. ఆయా జిల్లాల్లో మహిళ స్వయం సహాయక సంఘాలకు మరింత బలోపేతం చేసేందకు వీటి నుంచి కార్యకలాపాలు సాగించనున్నారు. ఒక్కో భవన నిర్మాణానికి రూ.5 కోట్ల చొప్పున 22 భవనాల నిర్మాణానికి రూ.110 కోట్లు మంజూరు చేశారు. ఇందిరా మహిళ శక్తి భవన్లలో శిక్షణా కేంద్రాలు ఏర్పాటు చేశారు. మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో శిక్షణ ఇవ్వడంతో పాటు స్వయం సహాయక సంఘాల ఉత్పత్తులకు మార్కెటింగ్, కామన్ వర్క్‌షెడ్, ఉత్పత్తుల ప్రదర్శన, మేళాలు, జీవనోపాధి, ఆర్థిక కార్యకలాపాల నిర్వహణ తదితర కార్యకలాపాలు నిర్వహించనున్నారు. ఈనెల 19న హన్మకొండ జిల్లా కేంద్రంలోని ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో నిర్వహించే ప్రజాపాలన విజయోత్సవ సభలో ఈ భవనాల నిర్మాణానికి సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు.