ప్రజలకు మరింత చేరువగా పాలన.. జీహెచ్ఎంసీలో పెరుగనున్న జోన్లు, సర్కిళ్లు

ప్రతీ డివిజన్‌లో ఒక వార్డు ఆఫీసును ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ప్రతీ వార్డు ఆఫీసులో ప్రజల నుంచి గ్రీవెన్స్ అందుకోవడానికి పలు శాఖలకు చెందిన సిబ్బంది ఉంటారు.

Advertisement
Update:2023-04-20 13:45 IST

హైదరాబాద్ నగరం నిత్యం అభివృద్ధి చెందుతూనే ఉన్నది. విశ్వనగరంగా మారుతున్న క్రమంలో నగర శివారుల్లో మరిన్ని కాలనీలు పుట్టుకొని వస్తున్నాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ ప్రభుత్వం హైదరాబాద్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. ఐటీ, ఫార్మా, హెల్త్ రంగాల‌కు హబ్‌గా నిలిచింది. దేశంలోని అతిపెద్ద నగరాల్లో ఒకటిగా మారుతున్న హైదరాబాద్‌లో నివసించే ప్రజలకు పాలన మరింత చేరువ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఒకప్పటి మున్సిపల్ కార్పొరేషన్ ఆఫ్ హైదరాబాద్‌లో 100 డివిజన్లు, 7 సర్కిళ్లు మాత్రమే ఉండేవి. కానీ జీహెచ్ఎంసీగా మారిన తర్వాత మరింతగా విస్తరించింది. నగరం అభివృద్ధి చెందుతున్న క్రమంలో.. అందుకు తగినట్లుగా ప్రస్తుతం 150 డివిజన్లు (వార్డులు), 30 సర్కిళ్లు, ఆరు జోన్లతో పరిపాలన సాగిస్తున్నది.

జీహెచ్ఎంసీలో 2007 నుంచి ఇవే 150 వార్డులతోనే పరిపాలన కొనసాగిస్తున్నారు. ఇప్పటికే దీన్ని 200 వార్డులు (డివిజన్లు)గా పెంచాలని తెలంగాణ ప్రభుత్వం భావిస్తోంది. అయితే అది ఎన్నికలతో ముడిపడిన అంశం కాబట్టి.. పరిపాలనా సౌలభ్యం కోసం సర్కిల్స్, జోన్స్ పెంచాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఉన్న 6 జోన్లను 12కు, 30 సర్కిళ్లను 48కి పెంచాలని భావిస్తున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతీ రెండు అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒక జోన్ ఉండేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. అలాగే ప్రతీ జోన్ పరిధిలో నాలుగు సర్కిల్స్ ఉండేలాగ పరిపాలనను విభజించనున్నారు.

నగరంలోని ప్రజలు తమ గ్రీవెన్స్ కోసం సర్కిల్ లేదా జోనల్ ఆఫీసుకు వెళ్లాల్సి వస్తోంది. రోడ్ల రిపేర్లు, శానిటేష‌న్‌, ప్రాపర్టీ ట్యాక్సులకు సంబంధించిన ఫిర్యాదులకు ఏ కార్యాలయానికి వెళ్లాలో అర్థం కాక స్థానికంగా ఉండే కార్పొరేటర్లకు చెబుతున్నారు. అయితే కార్పొరేటర్ల వద్దకు వెళ్లినా.. ఆ ఫిర్యాదులు అన్నీ తిరిగి జీహెచ్ఎంసీ అధికారులు, సిబ్బందికే వస్తాయి. అందుకే.. ప్రతీ డివిజన్‌లో ఒక వార్డు ఆఫీసును ప్రారంభించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది.

ప్రతీ వార్డు ఆఫీసులో ప్రజల నుంచి గ్రీవెన్స్ అందుకోవడానికి పలు శాఖలకు చెందిన సిబ్బంది ఉంటారు. సమస్య తీవ్రతను బట్టి అక్కడికక్కడే పరిష్కరించడమో.. లేదంటే పై అధికారులకు తెలియజేయడమో జరుగుతుంది. క్షేత్రస్థాయి సమస్యలన్నీ వార్డు ఆఫీసులు ప్రజలు తెలియజేయవచ్చు. ఈ వార్డు ఆఫీసుల పర్యవేక్షణ కమిషనర్ స్థాయి అధికారి చూస్తారని జీహెచ్ఎంసీ తెలిపింది. ఇప్పటికే దీనికి సంబంధించిన నివేదిక మున్సిపల్ శాఖకు అందిందని.. గ్రీన్ సిగ్నల్ లభించగానే వార్డు కార్యాలయాలు అన్నీ పూర్తి స్థాయిలో పని చేయడం ప్రారంభిస్తాయని అధికారులు తెలిపారు. 

Tags:    
Advertisement

Similar News