మహిళలకు గుడ్ న్యూస్.. అకౌంట్లోకి రూ.2500 ఎప్పుడంటే
అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారంటీల అమలుకు సంబంధించిన ముసాయిదాపై తొలి సంతకం చేశారు.
అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లో 6 గ్యారంటీలు అమలు చేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు చేస్తోంది. నెలాఖరులోగా మరో హామీ అమలు కోసం కసరత్తు మొదలు పెట్టింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మహాలక్ష్మి పథకం కింద అర్హులైన మహిళలకు ప్రతినెలా రూ.2,500 చెల్లించాలని నిర్ణయించింది. పథకంలో భాగంగా 18ఏళ్లు నిండి అర్హులైన మహిళలందరికీ అకౌంట్లో 2500 రూపాయలు జమ చేస్తారు. లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ రాకముందే పథకాన్ని అమలు చేసేలా చూడాలని ఆర్థికశాఖ అధికారులను ఆదేశించారు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి.
కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికే ఈ పథకాన్ని అమలు చేస్తోంది. మధ్యప్రదేశ్‌లోనూ ఇలాంటి పథకమే నడుస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అమలవుతున్న పథకాలను అధ్యయనం చేసి.. ప్రతినెలా ఎంత ఖర్చవుతుందో ఓ నివేదిక ఇవ్వాలని ఆదేశించారు సీఎం రేవంత్ రెడ్డి. కర్ణాటకలో దాదాపు మూడున్నర కోట్ల మంది మహిళలున్నారు. ఇందులో కోటీ 25 లక్షల మందికి డబ్బులు చెల్లిస్తున్నారు. 30 లక్షల మంది మహిళలకు చెల్లించాలంటే ప్రతినెలా రూ.750 కోట్లు అవసరం. కర్ణాటకలో ఈ పథకంపై 3వేల కోట్ల రూపాయల వరకు ఖర్చు చేస్తున్నారు. తెలంగాణలో కోటి 62లక్షలకుపైగా మహిళలున్నారు. ఈ రకంగా తెలంగాణలో పథకం అమలుకు 4వేల కోట్లకుపైనే ఖర్చు అవుతుందని అంచనా.
అధికారంలోకి వస్తే.. 6 గ్యారంటీలను అమలు చేస్తామని ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రకటించింది. అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన రోజే గ్యారంటీల అమలుకు సంబంధించిన ముసాయిదాపై తొలి సంతకం చేశారు. ఇందులో మొదటి గ్యారంటీ.. మహాలక్ష్మి పథకం కింద ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం. ఆరో గ్యారంటీ చేయూత కింద రూ.10 లక్షలతో రాజీవ్ ఆరోగ్యశ్రీ బీమా. ఇప్పటికే ఈ రెండు హామీలను ప్రభుత్వం అమలు చేసింది. ఇప్పుడు మహాలక్ష్మి పథకం కింద ప్రతినెలా మహిళలకు రూ.2,500 ఇవ్వబోతోంది. నెలఖారులోగా అర్హులకు నగదు జమ చేసేలా ప్రయత్నాలు మొదలుపెట్టింది.