తెలంగాణ రైతాంగానికి శుభవార్త..

ఈ ఏడాది నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు బంధు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది.

Advertisement
Update:2023-06-19 20:08 IST

తెలంగాణ రైతులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ఈ నెల 26 నుంచి రైతు బంధు నిధులు విడుద‌ల చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈమేరకు ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావుకు, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావుకు సీఎం కేసీఆర్ ఆదేశాలిచ్చారు. వానాకాలం పంట పెట్టుబడి 'రైతుబంధు' నిధులను ఎప్పటిలాగే నేరుగా వారి వారి బ్యాంక్ ఖాతాల్లో జమ అయ్యేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.


పోడు రైతులకు కూడా..

ఈ ఏడాది నుంచి పోడు భూములు సాగు చేసుకుంటున్న రైతులకు కూడా రైతు బంధు ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. త్వరలో పోడుభూముల పట్టాలు పంపిణీ చేసి, అనంతరం పట్టాలు పొందిన అన్నదాతలకు కూడా రైతుబంధు అందేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ ఆదేశించారు. ప్ర‌భుత్వ ప్ర‌క‌ట‌న‌తో రైతులు హర్షం వ్య‌క్తం చేశారు.

2018లో తెలంగాణ ప్రభుత్వం రైతుబంధు ప్రకటించి, ప్రతి ఏడాదీ ఎకరానికి రూ.10వేల ఆర్థిక సాయం చేస్తోంది. రెండు సీజన్లకు విడివిడిగా 5వేల రూపాయలను రైతుల ఖాతాల్లో జమచేస్తుంది. రాష్ట్రవ్యాప్తంగా 58.34 లక్షల మంది రైతులకు ప్రతి ఏడాది పెట్టుబడిసాయం అందిస్తోంది కేసీఆర్ ప్రభుత్వం. రైతుబంధు స్ఫూర్తితో కేంద్రం ఆ తర్వాత పీఎం కిసాన్ ని తెరపైకి తెచ్చింది. రైతుబంధు పథకం కింద నిల్వ ఉంచిన సరుకుపై రుణం తీసుకున్న రైతులకు ఆరు నెలల పాటు వడ్డీ రాయితీ ఇస్తారు. రైతులు తాము తీసుకున్న రుణాలపై బ్యాంకులకు ఎలాంటి వడ్డీని చెల్లించాల్సిన అవసరం లేదు. 

Tags:    
Advertisement

Similar News