అయ్యప్ప భక్తులకు శుభవార్త
అయ్యప్ప భక్తులకు ఉచిత ఆరోగ్య బీమా కవరేజీని వర్తింపజేయాలని కేరళ ప్రభుత్వం నిర్ణయించింది.
అయ్యప్ప భక్తులకు కేరళ సర్కార్ శుభ వార్త చెప్పింది. శబరిమల యాత్రికులకు ఉచిత బీమా వర్తింప జేయనున్నట్టు సీఎం పినరయి విజయన్ తెలిపారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఇవాళ జరిగిన మకరవిళక్కు సమీక్షా సమావేశంలో ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఆలయానికి వెళ్లే సమయంలో ఏదైనా ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన భక్తులకు రూ.5 లక్షల బీమాను వర్తింపజేస్తారు. అలాగే, మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించేందుకు అధికారులే ఏర్పాట్లు చేయనున్నారు. కేరళలోని దేవాలయాలను నిర్వహించే ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డ్ఈ స్పెషల్ బీమా కవరేజీ పథకానికి బీమా ప్రీమియం చెల్లించనుంది. కాగా రెండు నెలలపాటు జరగనున్న మకరవిళక్కు వేడుకలు ఈ నెల 16న మొదలై.. డిసెంబర్ చివరివారం వరకు కొనసాగుతాయి.
కొద్ది రోజులు ఆలయాన్ని మూసివేసి మళ్లీ జనవరి మూడో వారం వరకు భక్తుల కోసం ఆలయాన్ని తెరుస్తారు. ఈసారి రికార్డుస్థాయిలో 14వేల మంది పోలీసు సిబ్బంది, వాలంటీర్లతో భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్టు సీఎం విజయన్ తెలిపారు. శబరిమలకు వచ్చే ఒక్క భక్తుడు సైతం స్వామివారి దర్శనం కాకుండానే తిరిగి వెళ్లకుండా ఏర్పాట్లు చేస్తామని మంత్రి వీఎన్ వాసవన్ పేర్కొన్నారు. వర్చువల్ క్యూ బుకింగ్ మొదలైంది.. ఆన్‌లైన్‌లో బుక్ చేసుకోని వారికి రోజుకు 10వేల దర్శనం టికెట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. భక్తులు శబరిమల యాత్రను సజావుగా జరుపుకునేలా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సముద్రమట్టానికి 914 కిలోమీటర్ల ఎత్తులో పశ్చిమ కనుమల పర్వత శ్రేణుల్లో శబరిమల ఆలయం ఉన్నది. పతనంతిట్ట జిల్లాలోని పంబా నుంచి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది.