రైతులకు గుడ్‌న్యూస్‌.. నవంబర్‌లోనే రైతుబంధు!

మార్చిలో అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడేందుకు రబీ సీజన్‌ను ఒక నెల రోజులు ముందుకు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మే నెలలో సీఎం కేసీఆర్ ప్రకటించారు.

Advertisement
Update:2023-10-08 08:47 IST

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రబీ పంట కోసం రైతుబంధు నిధులను ముందస్తుగా విడుదల చేసేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టింది. డిసెంబర్‌లో రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలు జరగనుండటంతో రైతు బంధు నిధులు విడుదల చేయాలని ప్లాన్ చేస్తోంది. నవంబర్‌లో 70 లక్షల మంది రైతుల ఖాతాల్లో రూ.7,500 కోట్లు జమ చేయనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. 2018లో డిసెంబర్‌ 7న జరిగిన ఎన్నికలకు ముందు పంపిణీ చేసిన రైతుబంధు.. బీఆర్ఎస్‌ విజయంలో కీలక పాత్రపోషించింది.

సాధారణంగా రబీ పంట కోసం ఏటా జనవరిలో రైతుబంధు సాయాన్ని విడుదల చేస్తుంది ప్రభుత్వం. అయితే రాబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని దాన్ని ముందుకు తీసుకురావాలని ఆలోచిస్తుంది. ఈ మేరకు ఆర్థిక శాఖ అధికారులతో చర్చించిన సీఎం కేసీఆర్‌ నవంబర్‌లోనే రూ.7,500 కోట్ల నిధులు మంజూరు చేయాలని ఆదేశించినట్లు సమాచారం.

2018 ఎన్నికల టైంలో పోలింగ్‌కు ముందు నవంబర్‌లో రైతుబంధు పంపిణీకి వ్యతిరేకంగా ప్రతిపక్ష పార్టీలు ఎలక్షన్‌ కమిషన్‌కు ఫిర్యాదు చేశాయి. అయితే రైతులకు నేరుగా చెక్కుల పంపిణీ చేయకుండా బీఆర్ఎస్‌కు ఆదేశాలు జారీ చేసిన ఎలక్షన్‌ కమిషన్‌.. రైతుబంధు అప్పటికే కొనసాగుతున్న పథకం కాబట్టి నేరుగా రైతుల ఖాతాల్లోకి డబ్బులు బదిలీ చేయడానికి ప్రభుత్వానికి అనుమతి ఇచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి కూడా రైతుల ఖాతాల్లో నవంబర్‌లో నగదు జమ చేసేందుకు ఎలాంటి అడ్డంకులు ఉండవని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.

మార్చిలో అకాల వర్షాలు, వడగళ్ల వానల నుంచి పంటలను కాపాడేందుకు రబీ సీజన్‌ను ఒక నెల రోజులు ముందుకు జరపాలన్న రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాన్ని మే నెలలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఇదే విషయాన్ని ఎలక్షన్‌ కమిషన్‌కు ఉదహరించి రైతుబంధు పంపిణీ చేయాలని కేసీఆర్‌ సర్కార్‌ భావిస్తోంది.

Tags:    
Advertisement

Similar News