కలవరపెడుతున్న గోదావరి.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ
గురువారం వరద ప్రవాహం కాస్త తగ్గినా శుక్రవారం మరింత పెరిగింది. రాత్రికి ప్రవాహ స్థాయి ఒక్కసారిగా పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. ఈరోజు 56 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
గోదావరి వరద ప్రవాహం అంతకంతకూ పెరుగుతోంది. గత రాత్రి మూడో ప్రమాద హెచ్చరి స్థాయిని కూడా దాటేసింది. ప్రస్తుతం భద్రాచలం వద్ద గోదావరి మట్టం 53.1 అడుగులకు చేరుకుంది. భద్రాద్రి కలెక్టర్ మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. పరివాహక ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. స్థానిక అధికారులను అలర్ట్ చేశారు.
దోబూచులాట..
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు భద్రాచలం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ఆమధ్య తొలి ప్రమాద హెచ్చరికను కూడా ఉపసంహరించుకోవడంతో ఈ సీజన్ కి ఇక ఇబ్బంది లేదనుకున్నారు. కానీ ఆ తర్వాత ఉప్పెన మళ్లీ మొదలైంది. మొదటి, రెండో, మూడో ప్రమాద హెచ్చరికల స్థాయిని రోజుల వ్యవధిలోనే దాటేసింది గోదావరి. గురువారం వరద ప్రవాహం కాస్త తగ్గినా శుక్రవారం మరింత పెరిగింది. రాత్రికి ప్రవాహ స్థాయి ఒక్కసారిగా పెరగడంతో మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేయాల్సి వచ్చింది. ఈరోజు 56 అడుగులకు పైగా నీటిమట్టం చేరుకోవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
పునరావాస కేంద్రాలకు తరలింపు..
పోలవరం మొదలైన తర్వాత బ్యాక్ వాటర్ ప్రభావం భద్రాద్రి జిల్లాపై బాగా కనపడుతోంది. దీంతో పోలవరం గేట్లు ఎత్తి ఉంచాలని ఏపీని కోరింది తెలంగాణ ప్రభుత్వం. వచ్చిన నీటిని వచ్చినట్టు పోలవరం నుంచి కిందకు వదిలిపెడుతున్నా కూడా భద్రాచలం వద్ద ఉధృతి ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికే 430 గ్రామాలకు చెందిన ప్రజలను 40 పునరావాస కేంద్రాలకు తరలించారు. పునరావాస కేంద్రాల్లో వైద్యశిబిరాలను ఏర్పాటు చేశారు. వరద తగ్గుముఖం పట్టే ప్రాంతాల్లో తక్షణం శానిటేషన్ చేయించేలా సిబ్బందికి ఆదేశాలిచ్చారు జిల్లా కలెక్టర్ ప్రియాంక. భద్రాచలం పట్టణం పరిధిలోకి వరద చేరకుండా అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకుంటున్నారు. లోతట్టు ప్రాంతాల్లో చేరిన వరద నీటిని మోటర్ల ద్వారా తిరిగి గోదావరిలోకి మళ్లిస్తున్నారు.