తెలుగు రాష్ట్రాల్లో ఉద్రిక్తంగా మారిన అయ్యప్ప మాలధారుల ఆందోళన

అయ్యప్ప స్వామి జననం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అతడి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు.

Advertisement
Update:2022-12-31 12:38 IST

అయ్యప్ప స్వామి జననంపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నాస్తిక సంఘం నాయకుడు బైరి నరేష్ ను అరెస్టు చేయాలని తెలుగు రాష్ట్రాల్లో అనేక‌ చోట్ల అయ్యప్ప మాలధారులు నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, కర్నూలు తదితర ప్రాంతాల్లో నిర్వహించిన నిరసన ప్రదర్శనల్లో వందలాదిగా అయ్యప్ప మాలధారులు పాల్గొన్నారు. మరోవైపు బైరి నరేష్ ను అరెస్టు చేయాలని హైదరాబాద్ లోని అయ్యప్ప మాలధారులు చార్మినార్ వద్ద ఉన్న భాగ్యలక్ష్మి ఆలయానికి భారీగా చేరుకున్నారు.

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వారి కళ్ళు తెరిపించాలని అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారులు మాట్లాడుతూ.. అయ్యప్ప స్వామి జననం పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన బైరి నరేష్ ని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. అతడి పై పీడీ యాక్ట్ నమోదు చేయాలన్నారు. బైరి నరేష్ ని వెంటనే అరెస్ట్ చేస్తామని నిన్న పోలీసులు హామీ ఇచ్చారని.. కానీ ఇంతవరకు అతడిని అదుపులోకి తీసుకోలేదని అన్నారు.

ఇదిలా ఉండగా.. బైరి నరేష్ వ్యాఖ్యలను సమర్థిస్తూ మాట్లాడిన రేంజర్ల రాజేష్ అనే వ్యక్తి కూడా పరారీలో ఉన్నాడు. అయితే అతడు పరారీలో ఉన్నప్పటికీ అయ్యప్ప మాలధారులను రెచ్చగొట్టే విధంగా ట్వీట్లు చేస్తున్నాడు. మరోవైపు ఇతడు దర్శకుడు రామ్ గోపాల్ వర్మను కూడా వివాదంలోకి లాగాడు. ఎన్నో సార్లు వర్మ హిందూ దేవుళ్లకు వ్యతిరేకంగా మాట్లాడాడని.. అతడి పై ఎటువంటి చర్యలు తీసుకోని పోలీసులు బైరి నరేష్ పై ఎందుకు కేసులు పెట్టారని ట్వీట్ చేశాడు.

మధ్యాహ్నంలోగా లొంగిపోనున్న బైరి నరేష్

అయ్యప్ప స్వామిపై అనుచిత వ్యాఖ్యలు చేసి పరారీలో ఉన్న బైరి నరేష్ మధ్యాహ్నంలోగా లొంగిపోతానని పోలీసులకు సమాచారం ఇచ్చాడు. ప్రస్తుతం అతడు వరంగల్, కరీంనగర్ ప్రాంతాల్లో సంచరిస్తున్నట్లు గుర్తించిన పోలీసులు అతడి కోసం గాలింపులు కొనసాగిస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News