విశ్వనగరం అంటే ఫ్లైవోవర్లు మాత్రమే కాదు.. ప్రజలకు మౌలిక వసతులు కూడా కల్పించాలి : మంత్రి కేటీఆర్
కూకట్‌పల్లి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో వర్షా కాలంలో కొంత మునక ఏర్పడుతున్నది. ఇందుకు కారణమైన నాలాలను బాగు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని కేటీఆర్ చెప్పారు.
హైదరాబాద్ ఇప్పుడు విశ్వనగరంగా మారింది. గత తొమ్మిదేళ్లుగా ఎన్నడూ లేనంత వేగంగా నగరం అభివృద్ధి చెందింది. ప్రజలకు మంచి ప్రజా రవాణా, మెట్రో సేవలు అందుబాటులో తీసుకొని వచ్చాము. ఫ్లై వోవర్లు, అండర్ పాస్‌లు నిర్మించుకొని నగరంలో ట్రాఫిక్ సమస్యలకు చెక్ పెడుతున్నామని మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కూకట్‌పల్లి నియోజకపరిధిలోని బేగంపేట సమీపంలో అత్యంత ఆధునిక సౌకర్యాలతో నిర్మించిన వైకుంఠధామాన్ని కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. విశ్వనగరం అంటే కేవలం ఫ్లైవోవర్లు నిర్మించుకోవడం మాత్రమే కాదు. ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కూడా కల్పించాలని కేటీఆర్ అన్నారు.
నగరంలోని కుక్కల, దోమల బెడదను తగ్గించడానికి జీహెచ్ఎంసీ నిరంతరం పని చేస్తోందన్నారు. కూకట్‌పల్లి, ముషీరాబాద్ నియోజకవర్గాల్లో వర్షా కాలంలో కొంత మునక ఏర్పడుతున్నది. ఇందుకు కారణమైన నాలాలను బాగు చేయడానికి ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేశామని కేటీఆర్ చెప్పారు. ఒకప్పుడు ఫిల్మ్‌నగర్‌లో మహాప్రస్థానం అని ఉండేది. కానీ ఇప్పుడు బేగంపేటలో అంతకు మించిన సౌకర్యాలతో కూడిన వైకుంఠధామాన్ని నిర్మించుకున్నామని కేటీఆర్ చెప్పారు. బతికున్నన్ని రోజులు ఎలాగో బతుకుతాం. కానీ చనిపోయిన తర్వాత అయినా మనిషికి ప్రశాంతంగా అంత్యక్రియలు జరగాలనే ఇలాంటి ఆధునిక సౌకర్యాలతో నిర్మించామన్నారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలో హిందూ, ముస్లిం, క్రైస్తవులకు పక్కపక్కనే శ్మశాన వాటిక, ఖబరస్తాన్, సెమెట్రీ నిర్మించామన్నారు.
ఈ రోజు తెలంగాణ, హైదరాబాద్‌కు పెట్టుబడులు ఎక్కువగా వస్తున్నాయంటే దానికి సీఎం కేసీఆర్ పాలనే కారణమని అన్నారు. గత తొమ్మిదేళ్లుగా సుస్థిరమైన పాలన, నిబద్ధత కలిగిన ముఖ్యమంత్రి ఉండటం వల్లే అభివృద్ధిలో దూసుకొని పోతున్నామన్నారు. మరోసారి సీఎం కేసీఆర్‌ను గెలిపించి.. మరింతగా నగరాన్ని, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందామని కేటీఆర్ కోరారు. ప్రజలకు మంచి చేయాలనే సంకల్ప శుద్ధి ప్రభుత్వానికి ఉండాలి. అప్పుడే నిజమైన అభివృద్ధి జరుగుతుందన్నారు.
మాటలు మాట్లాడటం, నోటికి వచ్చినట్లు తిట్టడం చాలా సులభం. మాకు కూడా తిట్టడం వచ్చు. మేము కూడా తిట్టగలం. కానీ మేము పని చేయాలనేదే లక్ష్యంగా పెట్టుకున్నామని కేటీఆర్ అన్నారు. ఇదే హైదరాబాద్‌లో వరదలు వస్తే.. ఇప్పుడు ప్రభుత్వాన్ని తిడుతున్న బీజేపీనే కదా కేంద్రంలో ఉన్నది. ఏనాడైనా సహాయం చేసిందా? తెలంగాణ ప్రభుత్వం స్వయంగా లేఖ రాసినా ఒక్క రూపాయి విదల్చలేదని కేటీఆర్ అన్నారు.
బేగంపేటలోని ధనియాలగుట్టలోని శ్యామ్‌లాల్ బిల్డింగ్ వద్ద 4 ఎకరాల్లో రూ.8.54 కోట్లతో 'మహాపరినిర్వాణ' వైకుంఠధామాన్ని నిర్మించారు. ఈ హైటెక్ వైకుంఠధామంలో అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, సెరిమోనియల్ హాల్, చెక్క నిల్వ గది, పిండ ప్రదానం చేసే ప్రాంతం, వెయిటింగ్ హాల్, బాడీ ప్లాట్‌ఫామ్స్, ఫీచర్ గోడలు, ప్రవేశం, నిష్క్రమణ తోరణాలు, ఫలహారశాల, నీటి వసతిసహా టాయిలెట్లు ఏర్పాటు చేశారు. అంతేకాకుండా ఇక్కడ పార్కింగ్, వైఫై సౌకర్యం కూడా ఉన్నది. శివుని విగ్రహంతో పాటు అంతిమ యాత్ర వాహనాల సౌకర్యాలు కూడా ఉన్నాయి.