బెంగళూరే హెచ్చ‌రిక‌.. నీటి ఎద్ద‌డిపై హైద‌రాబాదీ మేలుకోవాలిక‌!

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నీటి కొర‌త పెరుగుతోంది. భూగ‌ర్భ‌జ‌లాలు త‌గ్గిపోవడంతో వేలాది మంది న‌గ‌ర‌వాసులు మంచినీటి ట్యాంక‌ర్ల కోసం జ‌ల‌మండ‌లిని సంప్ర‌దిస్తున్నారు.

Advertisement
Update:2024-04-03 11:46 IST

ఐటీ రాజ‌ధాని బెంగ‌ళూరు మంచినీటి కొర‌త‌తో అల్లాడిపోతోంది. రోజూ 50 కోట్ల లీట‌ర్ల నీటికొర‌త‌తో బెంగళూరులో జ‌నం అల‌మ‌టించిపోతున్నారు. ఐటీ ఉద్యోగులను మీ ఊరెళ్లి వ‌ర్క్‌ఫ్రం హోం చేసుకోండి అని కంపెనీలు పంపించేస్తున్నాయి. ముందే మేల్కొని నీటిని పొదుపుగా వాడుకోక‌పోతే ఇలాంటి ప‌రిస్థితి హైద‌రాబాద్‌లోనూ ముంచుకొచ్చే ప్ర‌మాదం ఉంది.

అడుగంటుతున్న‌ భూగ‌ర్భ‌జలాలు

తెలంగాణ‌లో గ‌త ఆరు నెల‌ల్లో 57 శాతానికి పైగా వ‌ర్ష‌పాతం లోటు ఏర్ప‌డింది. స‌రైన వాన‌ల్లేక గ‌త ఏడాది మార్చి నెల‌తో పోల్చితే గ్రౌండ్ వాట‌ర్ లెవల్ 2.5 మీట‌ర్ల లోతుకు ప‌డిపోయింది. మ‌రోవైపు గ్రేట‌ర్ హైద‌రాబాద్ ప‌రిధిలో నీటి కొర‌త పెరుగుతోంది. భూగ‌ర్భ‌జ‌లాలు త‌గ్గిపోవడంతో వేలాది మంది న‌గ‌ర‌వాసులు మంచినీటి ట్యాంక‌ర్ల కోసం జ‌ల‌మండ‌లిని సంప్ర‌దిస్తున్నారు. ఒక్క మార్చి నెల‌లోనే ల‌క్షా 68 వేల ట్యాంక‌ర్ల నీటిని జ‌ల‌మండ‌లి స‌ర‌ఫ‌రా చేసింది. ఇది గ‌త సంవత్స‌రం మార్చి నెల కంటే 60వేలు ఎక్కువ‌. దీన్ని బ‌ట్టే నీటి ఎద్ద‌డి ఎలా పెరుగుతుందో అర్థం చేసుకోవ‌చ్చు. ప్రైవేట్ వాట‌ర్ ట్యాంక‌ర్ల‌కూ గిరాకీ పెరిగింది.

పొదుపు నేర్చుకోవాలి.. త‌ప్ప‌దు

ప్ర‌స్తుతం ఓ ప‌క్క కృష్ణా జ‌లాలు, మ‌రోవైపు గోదావ‌రి నీళ్లు న‌గ‌రానికి స‌మృద్ధిగా అందుతున్నాయి. చాలా నివాస ప్రాంతాల్లో వాడుక నీరుకు కూడా బోరు లేకుండా ఇవే వాడుతున్నారు. నీళ్లొస్తున్నాయి క‌దా అని ఇష్టారాజ్యంగా వాడితే బెంగ‌ళూరు లాంటి ప‌రిస్థితే మ‌న‌కూ రావ‌చ్చు. అందుకే సాధ్య‌మైనంత పొదుపుగా నీటినివాడాల‌ని జీహెచ్ఎంసీ అధికారులు చెబుతున్నారు. పైపులు పెట్టి కార్లు, టూ వీల‌ర్లు క‌డ‌గడం, పార్కింగ్ ఏరియాలు, ఇత‌ర ఆరుబ‌యట‌ ప్రాంతాలు క‌డ‌గ‌డానికి భారీగా నీళ్లు వాడి ఇంటి ముందు మ‌డుగు చేస్తే జ‌రిమానాలు విధిస్తామ‌ని హెచ్చ‌రిక‌లు జారీ చేస్తున్నారు. జరిమానాల గురించి కాక‌పోయినా నీటి ఎద్ద‌డి వ‌స్తే ప‌డే ఇబ్బందుల‌ను దృష్టిలో పెట్టుకుని పొదుపు మంత్రం పాటించ‌డం హైద‌రాబాదీల వంతు.

Tags:    
Advertisement

Similar News