పుష్పను తలదన్నే స్మగ్లింగ్ సీన్.. హన్మకొండలో ఎవ్వరికీ అనుమానం రాకుండా
ఖాళీగా ఉన్న లారీలపై ఎవరికీ అనుమానం రాదు, ఒకవేళ వస్తే క్యాబిన్లో, డ్రైవర్ సీట్ కింద చెక్ చేసి పంపించేస్తారు. పోలీసులు మరీ అంత తెలివితక్కువవాళ్లు అని లెక్కగట్టిన స్మగ్లర్లు ఖాళీ లారీ డ్రామా ఆడారు.
పుష్ప సినిమాలో పోలీసుల కళ్లుగప్పి ఎర్రచందనం స్మగ్లింగ్ ఎలా చేయాలో డీటెయిల్డ్ గా చూపించారు. పాలట్యాంకర్ లో, పెళ్లి లారీలో.. ఎవరికీ కనపడకుంటా దుంగల్ని చెక్ పోస్ట్ లు దాటించేస్తుంటాడు హీరో. ఆ సినిమాలో చూపించని ఓ ప్లాన్ ని రియల్ లైఫ్ లో అమలుచేసి ఔరా అనిపించారు గంజాయి స్మగ్లర్లు. కానీ వారి ప్లాన్ ని ఛేదించారు పోలీసులు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం పెంచికల్ పేట వద్ద గంజాయి లారీని పట్టుకున్నారు. చెక్ పోస్ట్ దాటించేస్తున్న 300 కేజీల గంజాయిని పోలీసులు పట్టుకోవడంతో అసలు కథ బయటపడింది. పోలీసులకు కూడా అనుమానం రాకుండా చెక్ పోస్ట్ దాటించబోయారు కానీ, చివరకు ప్లాన్ బెడిసికొట్టి ఆ గంజాయి ప్యాకెట్లు బయటపడ్డాయి.
ఎలా చేశారు..?
చూడ్డానికి అది ఓ ఖాళీ లారీ. ఖాళీగా ఉన్న లారీలపై ఎవరికీ అనుమానం రాదు, ఒకవేళ వస్తే క్యాబిన్లో, డ్రైవర్ సీట్ కింద చెక్ చేసి పంపించేస్తారు. పోలీసులు మరీ అంత తెలివితక్కువవాళ్లు అని లెక్కగట్టిన స్మగ్లర్లు ఖాళీ లారీ డ్రామా ఆడారు. లారీపైన పరదా కట్టి, ఆ పరదాలో గంజాయి ప్యాకెట్లను పేర్చి పెట్టారు. ఏపీనుంచి సరుకు మధ్యప్రదేశ్ కి దాటించాలని చూశారు. వైజాగ్ నుంచి అన్ని చెక్ పోస్ట్ ల దగ్గర కూడా ఇలాగే ఖాళీ లారీని పోలీసులు వదిలిపెట్టారు. కానీ హన్మకొండ పోలీసులు మాత్రం అనుమానంతో తనిఖీ చేశారు. గంజాయి పట్టుకున్నారు.
పోలీసులే షాక్ అయిన ఘటన..
ఖాళీ లారీలో పైన పరదా కట్టి ఉంటే.. ఎండపడకుండా ఏర్పాటు అనుకున్నారు. కానీ ఆ పరదాలోనే అసలు మేటర్ దాగుంది అని తెలుసుకునే సరికి పోలీసులే షాకయ్యారు. ఒకటీ రెండు కాదు, ఏకంగా 300కేజీల గంజాయి ప్యాకెట్లు లారీపైన పేర్చి ఉన్నాయి. వాటిని స్వాధీనం చేసుకుని డ్రైవర్, క్లీనర్ ని అరెస్ట్ చేశారు. గంజాయి స్మగ్లింగ్ ముఠా గుట్టు రట్టు చేశారు.