KG టు PG.. గంభీరావుపేట ప్రత్యేకతలు ఏంటంటే..?
5 నెలల రికార్డ్ సమయంలో ఇది పూర్తయింది. 3500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశముంది. ఈ విద్యా సంవత్సరం నుంచే బోధన మొదలైంది.
కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్య అందిస్తామంటూ ఆనాడు కేసీఆర్ ఇచ్చిన హామీ ఇప్పుడు అక్షరసత్యమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేటలో కేజీ-పీజీ విద్యాసంస్థ అందుబాటులోకి రావడం స్థానికులకు వరంగా మారింది. ప్రతి జిల్లాలోనూ ఇలాంటి ఓ విద్యాసంస్థ ఏర్పాటు సీఎం కేసీఆర్ లక్ష్యం. ఇంతకీ గంభీరావు పేటలో ఉన్న విద్యా సంస్థ ప్రత్యేకతలేంటి..? మీరే చదవండి.
లక్ష చదరపు అడుగులు..
కేజీ నుంచి పీజీ వరకు అంటే స్కూళ్లు, కాలేజీలు అన్నీ అందులోనే ఉండాలి. అంటే ఓ మినీ యూనివర్శిటీలాగా అన్నమాట. అందుకే ఎక్కడా ఖర్చుకు వెనకాడకుండా భారీ ఎత్తున ఈ విద్యా సంస్థలను ఏర్పాటు చేశారు. లక్ష చదరపు అడుగుల విస్తీర్ణంలో దీన్ని నిర్మించారు. కిండర్ గార్టెన్ నుంచి పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న కేజీ-పీజే విద్యాసంస్థల్లో ఇదే మొట్టమొదటి క్యాంపస్. 5 నెలల రికార్డ్ సమయంలో ఇది పూర్తయింది. 3500 మందికి పైగా విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశముంది. ఈ విద్యా సంవత్సరం నుంచే బోధన మొదలైంది.
రూ. 8.5కోట్ల వ్యయం..
గంభీరావుపేటలోని ఈ విద్యాసంస్థల నిర్మాణానికి 8.5 కోట్ల రూపాయల ఖర్చు అయింది. కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎంఆర్ఎఫ్ సంస్థ, దివీస్ లేబొరేటరీస్, కె-రహేజా, గ్రీన్‌కో గ్రూప్, యశోద హాస్పిటల్స్ నిధులు సమకూర్చాయి.
ప్రీ ప్రైమరీ, అంగన్వాడీ కేంద్రం..
కేజీ టు పీజీ విద్యా సంస్థల్లో తొలి అంకం ప్రీ ప్రైమరీతో మొదలవుతుంది. రెండేళ్లు దాటిన పిల్లలను అంగన్వాడీలకు తెస్తారు. ఆరేళ్ల వరకు వారికి ఇక్కడ ఆటపాటలతో విద్యాబోధన చేస్తారు. 11,298 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న అంగన్వాడీ కేంద్రంలో మొత్తం 12 తరగతి గదులున్నాయి. 200 మందికి పైగా పిల్లలకు ఇక్కడ చదువుకునే వీలుంది. మీడియా గది, డైనింగ్ హాల్, వంటగది, ఆట స్థలం, భవిత కేంద్రం ఇతర ప్రత్యేకతలు.
ఎలిమెంటరీ స్కూల్..
కేజీ-పీజీ క్యాంపస్ లో రెండో మెట్టు ప్రాథమిక పాఠశాల. 6 నుండి 12 సంవత్సరాల మధ్య వయస్సు గల పిల్లలకు ఇక్కడ బోధన జరుగుతుంది. 400 మంది వరకు పిల్లల్ని ఈ స్కూల్ లో చేర్చుకుంటారు. 11,298 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ పాఠశాలలో 12 తరగతి గదులుంటాయి.
హైస్కూల్, కాలేజీ..
హైస్కూల్ లో 21 తరగతి గదులున్నాయి. దాదాపు 700 మంది విద్యార్థుల సామర్థ్యం ఈ హైస్కూల్ సొంతం. జూనియర్ కాలేజీ కోసం 10 తరగతి గదులు నిర్మించారు. 400 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే అవకాశముంది. ఇక్కడ కాలేజీలో చేరిన ప్రతి విద్యార్థికి గిఫ్ట్ ఎ స్మైల్ పేరుతో ఉచితంగా ట్యాబ్ ఇస్తారు. నీట్, జేఈఈ పరీక్షలకు ప్రిపేర్ అయ్యేలా విద్యార్థులకోసం ఈ ట్యాబ్ లు రూపొందించారు.
డిగ్రీ కాలేజీ..
22వేల చదరపు అడుగుల మేర సువిశాల ప్రాంగణంలో డిగ్రీ కాలేజీ ఏర్పాటు చేశారు. 840 మంది విద్యార్థులు ఇక్కడ చదువుకునే వీలుంది. 21 క్లాస్ రూమ్ లతోపాటు, డిజిటల్ రూమ్, ల్యాబొరేటరీలు, లైబ్రరీ.. ఇలా అన్నీ అందుబాటులో ఉన్నాయి. ఇక డైనింగ్ హాల్ మరో ప్రత్యేకత. 8,270 చదరపు అడుగుల విస్తీర్ణంలో అతి భారీ డైనింగ్ హాల్ ఇక్కడ నిర్మించారు. ఒకేసారి వెయ్యిమంది ఇక్కడ భోజనం చేయొచ్చు.
ఉర్దూ మీడియం స్కూల్
ఇదే క్యాంపస్ లో ఉర్దూ మీడియం స్కూల్ కూడా ఉంది. ఇందులో టెన్త్ క్లాస్ వరకు చదువుకునే అకాశముంది. 200 మంది పిల్లలు ఇక్కడ చదువుకోవచ్చు.
ల్యాబ్ లు, ప్లే గ్రౌండ్..
ఎలిమెంటరీ, హైస్కూల్ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా కంప్యూటర్ ల్యాబ్ లు అందుబాటులోకి తెచ్చారు. పూర్తి స్థాయి ఇంటర్నెట్ సదుపాయం ఉంది. 50 కంప్యూటర్లు, ఇంటరాక్టివ్ స్క్రీన్, ప్రొజెక్టర్ వంటి సౌకర్యాలు కల్పించారు. ఇక అథ్లెటిక్స్, వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్, కబడ్డీ.. ఎలాంటి గేమ్స్ కయినా సరిపోయే అత్యాథునిక క్రీడా ప్రాంగణం కేజీ-పీజీ విద్యా సంస్థల సొంతం. FIFA స్టాండర్డ్ ఆస్ట్రో టర్ఫ్ తో 40,000 చదరపు అడుగుల మల్టీపర్పస్ ప్లే గ్రౌండ్ ఏర్పాటు చేశారు.
లైబ్రరీ, స్కిల్ డెవలప్ మెంట్ కేంద్రం..
పాఠ్యాంశాలతోపాటు, ఇతర విషయాల్లో కూడా పరిజ్ఞానం పెంచుకోడానికి అతి పెద్ద లైబ్రరీ ఇక్కడ ఏర్పాటు చేశారు. ఒకేసారి 100మంది ఈ లైబ్రరీలో కూర్చునే విధంగా సీటింగ్ ఉంది. 3వేలకు పైగా పుస్తకాలు అందుబాటులో ఉన్నాయి. కంప్యూటర్లు, ఇంటర్నెట్ సౌకర్యం కూడా ఉంది. ఇక స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్ లో స్థానిక యువతకు ట్రైనింగ్ ఇస్తుంటారు. 40కి పైగా కుట్టుమిషన్లు ఏర్పుటు చేశారు. ఇతర వృత్తులవారికి కూడా తగిన శిక్షణ ఇవ్వడానికి ఉపకరణాలు ఉన్నాయి.