సాయన్న బిడ్డపై గద్దర్ కూతురి పోటీ.. కంటోన్మెంట్‌లో ఆసక్తికరమైన పోరు
1994 నుంచి 2018 వరకు ఆరుసార్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే అందులో 5సార్లు జి.సాయన్నే గెలిచారంటే ఆయనకు ఈ నియోజకవర్గంపై ఎంత పట్టుందో అర్థమవుతుంది.
=హైదరాబాద్ నగర పరిధిలోని కంటోన్మెంట్ నియోజకవర్గం ఈసారి బిగ్ ఫైట్‌కు సిద్ధమైంది. కంటోన్మెంట్ ఎమ్మెల్యేగా సుదీర్ఘకాలం పని చేసిన దివంగత సాయన్న కుమార్తె లాస్యనందితకు బీఆర్ఎస్ టికెట్ ఇస్తే.. ఆమెకు పోటీగా ఉద్యమకారుడు, దివంగత గద్దర్ కుమార్తె వెన్నెలను కాంగ్రెస్ బరిలోకి దించింది. ఇద్దరూ ప్రముఖ నేతల బిడ్డలు కావడంతో పోటీ రసవత్తరంగా ఉండబోతోంది.
కంటోన్మెంట్ అంటే సాయన్న.. సాయన్న అంటేనే కంటోన్మెంట్
1994 నుంచి 2018 వరకు ఆరుసార్లు కంటోన్మెంట్ నియోజకవర్గానికి ఎన్నికలు జరిగితే అందులో 5సార్లు జి.సాయన్నే గెలిచారంటే ఆయనకు ఈ నియోజకవర్గంపై ఎంత పట్టుందో అర్థమవుతుంది. 1994లో టీడీపీ టికెట్‌పై కంటోన్మెంట్ ఎమ్మెల్యే అయిన సాయన్న 1999, 2004ల్లోనూ గెలిచారు. 2009లో శివశంకర్ చేతిలో ఓడినా 2014లో రాష్ట్ర విభజన తర్వాత టీఆర్ఎస్ గాలిలోనూ ఎదురునిలిచి టీడీపీ అభ్యర్థిగా విజయం సాధించారు. తర్వాత బీఆర్ఎస్‌లో చేరి అక్కడి నుంచీ 2018లో ఎమ్మెల్యేగా గెలిచారు. ఇటీవల ఆయన చనిపోవడంతో ఈ ఎన్నికల్లో ఆయన కుమార్తె, కార్పొరేటర్‌గా ఉన్న లాస్యనందితకు బీఆర్ఎస్ టికెటిచ్చింది. తండ్రి వారసత్వం, బీఆర్ఎస్ అభ్యర్థిత్వం కలిపి గెలుపు తెస్తాయని నందిత నమ్మకంగా ఉన్నారు.
గద్దర్ కూతురు అయితే సరైన పోటీ అని..
మరోవైపు జీవితకాలం ఉద్యమకారుడిగా బతికి, చివరిలో రాజకీయాలవైపు మొగ్గు చూపిన గద్దర్ అధికారం అనుభవించకుండానే కన్ను మూశారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తానని ఆయన కుమార్తె వెన్నెల ప్రకటించడంతో కాంగ్రెస్ ఆమెకు టికెట్టిచ్చి కంటోన్మెంట్‌లో బరిలోకి దింపింది. సాయన్న లాంటి ప్రజాదరణ ఉన్న నేత కుమార్తెతో పోటీకి గద్దర్ లాంటి పేరొందిన ఉద్యమకారుడి వారసురాలయితే సరైన పోటీ అని భావించిన టీపీసీసీ నేతలు ఆమె ఇంకా కాంగ్రెస్‌లో చేరకముందే టికెట్ ఇవ్వడం విశేషం.