ఈ-గరుడ బస్సుల్లో ఫ్రీ స్నాక్ బాక్స్.. టీఎస్ఆర్టీసీ వినూత్న పథకం
స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కీ ప్యాకెట్‌తో పాటు మౌత్ ఫ్రెష్‌నర్, టిష్యూ పేపర్ ఉంటాయి.
ప్రయాణికులకు మరిన్ని సౌకర్యవంతమైన సేవలు అందించడానికి టీఎస్ఆర్టీసీ నడుంభిగించింది. ఇప్పటికే కొత్త బస్సులు, ఎలక్ట్రిక్ బస్సులు, స్లీపర్ కోచ్‌లతో దూర ప్రాంత ప్రయాణికులను ఆకట్టుకుంటున్న సంస్థ.. తాజాగా సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఇకపై ప్రయాణికులకు వాటర్ బాటిల్‌తో పాటు 'స్నాక్ బాక్స్'ను ఇవ్వాలని టీఎస్ఆర్టీసీ సూత్రప్రాయంగా నిర్ణయించింది. పైలెట్ ప్రాజెక్టు కింద హైదరాబాద్ - విజయవాడ మార్గంలో తిరుగుతున్న ఈ-గరుడ బస్సుల్లో స్నాక్ బాక్స్ విధానాన్ని ఈ నెల 27 (శనివారం) నుంచి అమలు చేయనున్నది. ప్రయాణికుల నుంచి వచ్చే స్పందనను బట్టి మిగిలిన లాంగ్ జర్నీ సర్వీసుల్లో కూడా అమలు చేస్తామని సంస్థ చెబుతోంది.
స్నాక్ బాక్స్‌లో చిరుధాన్యాలతో తయారు చేసిన కారా, చిక్కీ ప్యాకెట్‌తో పాటు మౌత్ ఫ్రెష్‌నర్, టిష్యూ పేపర్ ఉంటాయి. స్నాక్‌బాక్స్ కోసం టికెట్ రేట్‌లోనే రూ.30 నామ మాత్రపు ధరను టీఎస్ఆర్టీసీ నిర్ణయించింది. ఇందుకోసం బస్సులో సిబ్బందికి ప్రత్యేకంగా డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని కూడా టీఎస్ఆర్టీసీ యాజమాన్యం తెలిపింది. ఇప్పటికే ఏసీ బస్ సర్వీసుల్లో వాటర్ బాటిల్ ఇస్తున్నారు. తాజాగా స్నాక్ బాక్స్‌ను 9 ఎలక్ట్రిక్ ఈ-గరుడ బస్సుల్లో ఇవ్వనున్నారు.
'ప్రజలకు మరింతగా చేరువ అయ్యేందుకు వినూత్న కార్యక్రమాలతో టీఎస్ఆర్టీసీ ముందుకు వెళ్తోంది. అందులో భాగంగా ప్రయాణికులకు స్నాక్ బాక్స్ ఇవ్వాలని నిర్ణయించింది. ఐక్యరాజ్య సమితి 2023 సంవత్సరాన్ని చిరు ధాన్యాల సంవత్సరంగా ప్రకటించింది. ఈ నేపథ్యంలోనే సంపూర్ణ ఆరోగ్యాన్ని కలిగించడంతో పాటు, రోగ నిరోధక శక్తిని బలపరిచే చిరు ధాన్యాలతో చేసిన కారా, చిక్కీ ప్యాకెట్లతో పాటు ప్రయాణంలో ఉపయోగపడే మౌత్ ఫ్రెష్‌నర్, టిష్యూ పేపర్‌తో కూడిన బాక్స్‌ను ప్రయాణికులకు అందించనున్నది. టీఎస్ఆర్టీసీ ఏ కార్యక్రమం తీసుకొని వచ్చినా ప్రయాణికులు బాగా ఆదరిస్తున్నారు. సంస్థను ప్రోత్సహిస్తున్నారు. ఈ స్నాక్ బాక్స్ విధానాన్ని కూడా అలాగే ఆదరించాలి' అని ట్విట్టర్‌లో టీఎస్ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్థన్ రెడ్డి, ఎండీ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు.
ప్రతీ స్నాక్ బాక్స్‌లో క్యూఆర్ కోడ్ ఉంటుంది. దీన్ని ఫోన్‌లో స్కాన్ చేసి.. స్నాక్ బాక్స్ విధానంపై, అందులో ఆహారంపై సంస్థకు ఫీడ్ బ్యాక్ ఇవ్వవచ్చు. ఈ ఫీడ్ బ్యాక్‌ను పరిగణలోకి తీసుకొని మార్పులు, చేర్పలు చేస్తామని సంస్థ యాజమాన్యం తెలిపింది. మిగిలిన బస్సుల్లో కూడా విస్తరించేందుకు ఈ ఫీడ్ బ్యాక్ ఉపయోగపడుతుందని సంస్థ పేర్కొంది.