తెలంగాణలో ఫాక్స్‌కాన్ పెట్టుబడులు.. లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు

ఫాక్స్‌కాన్ సంస్థ కోసం ఇప్పటికే నాగార్జునసాగర్ రోడ్డులోని ఇబ్రహీంపట్నం వద్ద 250 ఎకరాల స్థలాన్ని సిద్ధంగా ఉంచారు.

Advertisement
Update:2023-03-02 16:33 IST

ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ మాన్యుఫ్యాక్చరర్, సర్వీస్ ప్రొవైడింగ్ కంపెనీ ఫాక్స్‌కాన్ తెలంగాణలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. తైవాన్ (చైనా)కు చెందిన ఈ హార్డ్‌వేర్ టెక్నాలజీ కంపెనీకి ఇప్పటికే తమిళనాడులోని శ్రీపెరంబదూర్, ఏపీలోని శ్రీసిటీ సెజ్‌లో అసెంబ్లింగ్ యూనిట్లు ఉన్నాయి. చైనాకు చెందిన షావోమీ, ఒప్పో, రియల్‌మీ వంటి ఫోన్లతో పాటు ల్యాప్‌టాప్, ట్యాబ్స్ వంటి ఎలక్ట్రానిక్ పరికరాలను ఫాక్స్‌కాన్ కంపెనీనే అసెంబ్లింగ్ చేస్తుంది. అంతే కాకుండా.. మదర్ బోర్డులు, చిప్స్ తయారీలో ఫాక్స్‌కాన్ ఆసియాలోనే అగ్రగామిగా ఉన్నది.

ఇలాంటి అంతర్జాతీయ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చింది. ఇండియా పర్యటనకు వచ్చిన ఫాక్స్‌కాన్ (మాతృసంస్థ పేరు హోన్‌హాయ్ ప్రెసిషన్ ఇండస్ట్రీ కంపెనీ లిమిటెడ్) చైర్మన్ యంగ్ లీ బుధవారం ప్రధాని నరేంద్ర మోడీతో భేటీ అయ్యారు. ఈ రోజు ప్రపంచంలోనే అతిపెద్ద ప్రోటోటైపింగ్ సెంటర్ టీ-వర్క్స్ ప్రారంభోత్సవం సందర్భంగా హైదరాబాద్ వచ్చారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌తో యంగ్ లీతో పాటు సంస్థ ప్రతినిధులు భేటీ అయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఫాక్స్‌కాన్, రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఎంవోయూ కుదుర్చుకున్నారు. సీఎం కేసీఆర్, చైర్మన్ యంగ్ లీ వీటిపై సంతకాలు చేశారు.

ఫాక్స్‌కాన్ సంస్థ కోసం ఇప్పటికే నాగార్జునసాగర్ రోడ్డులోని ఇబ్రహీంపట్నం వద్ద 250 ఎకరాల స్థలాన్ని సిద్ధంగా ఉంచారు. ఇక్కడే ఫాక్స్‌కాన్ భారీ అసెంబ్లింగ్ యూనిట్ నెలకొల్పుతుందని తెలంగాణ ఇండస్ట్రీస్, ఐటీ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్ రంజన్ తెలిపారు.

కాగా, ఫాక్స్‌కాన్‌తో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందానికి సంబంధించిన వివరాలను మంత్రి కేటీఆర్ ట్విట్టర్‌లో షేర్ చేశారు. 'ఫాక్స్‌కాన్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి ఒప్పందం కుదుర్చకున్న విషయాన్ని తెలియజేయడానికి చాలా సంతోషంగా ఉన్నది. హోన్‌హాయ్ ఫాక్స్‌కాన్ సంస్థ ఇక్కడ నెలకొల్పే హార్డ్‌వేర్ ఫెసిలిటీ కారణంగా ఒక లక్ష మంది యువతకు ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఈ మేరకు ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్, ఫాక్స్‌కాన్ చైర్మన్ యంగ్ లీ ఎంవోయూలపై సంతకాలు చేశారు' అని మంత్రి కేటీఆర్ ప్రకటించారు.

ఫాక్స్‌కాన్ కంపెనీల్లో అత్యధికంగా మహిళలే పని చేస్తుంటారు. ఏపీలోని శ్రీసిటీలో నెలకు దాదాపు 30 లక్షల ఫోన్లు తయారవుతాయి. ఇందులో 85 శాతం మంది మహిళలే పని చేస్తుండటం గమనార్హం. 10వ తరగతి నుంచి ఇంజనీరింగ్ చదువుకున్న వారికి ఉద్యోగాలు ఇవ్వడం ఈ కంపెనీ ప్రత్యేకత. మహిళా సాధికారతకు ఫాక్స్‌కాన్ చాలా కృషి చేస్తోంది. ఇప్పుడు లక్ష ఉద్యోగాలు కల్పించనున్న ఫాక్స్‌కాన్ అందులో సగం మహిళలకే కేటాయించే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు.


Tags:    
Advertisement

Similar News