కూలీల కుటుంబాల్లో మృత్యుఘోష.. - ఆటోను బస్సు ఢీకొనడంతో నలుగురు మృతి

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందింది.

Advertisement
Update:2024-02-28 16:20 IST

కూలీలతో వెళుతున్న ఆటోను ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో నలుగురు మృతిచెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో బుధవారం ఉదయం జరిగింది. జిల్లా ప‌రిధిలోని మోతె సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. మునగాల మండలం రామసముద్రానికి చెందిన 15 మంది కూలీలు మిరప కోత పనుల కోసం ఆటోలో బయలుదేరారు. వీరి ఆటో మోతె మండలం బురకచెర్ల గ్రామానికి వెళుతుండగా.. మార్గంలోనే ఆర్టీసీ బస్సు వీరి ఆటోను ఢీకొట్టింది. సూర్యాపేట– ఖమ్మం జాతీయ రహదారి అండర్‌ పాస్‌ వంతెన వద్ద ఈ ఘటన జరిగింది.

ఈ ప్రమాదంలో ముగ్గురు కూలీలు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరో మహిళ మృతిచెందింది. మరో 11 మంది తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం సూర్యాపేటలోని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సు మధిర డిపోకు చెందినదిగా గుర్తించారు. వేగంగా వస్తున్న బస్సు అదుపుతప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Tags:    
Advertisement

Similar News