బోనులో చిరుత.. తిరుమలలో కాదు
ఎక్కడా ఎవరికీ ప్రమాదం లేకుండా చిరుత బోనులో చిక్కడం విశేషం. ఎవరినీ గాయపరచకముందే, పశువులపై దాడి చేయకముందే చిరుతను బంధించగలిగారు ఫారెస్ట్ అధికారులు.
తెలుగు రాష్ట్రాలకు సంబంధించి చిరుత పులి బోనులో చిక్కిందంటే అందరూ తిరుమల గురించే అనుకుంటారు. ఇటీవల ఏకంగా ఐదు చిరుతలను బోనులో బంధించి ఏపీ అటవీశాఖ వార్తల్లో నిలిచింది. అయితే తెలంగాణలో కూడా ఇప్పుడో చిరుత బోనులో చిక్కింది. నిజామాబాద్ జిల్లా నవీపేట మండలంలోని యంచ గ్రామ పరిసరాల్లో ఆపరేషన్ చిరుత సక్సెస్ అయింది.
నాలుగు రోజులుగా భయం భయం..
నాలుగు రోజులుగా పలు గ్రామాలకు కంటిమీద కునుకులేకుండా చేసింది ఆ చిరుత. నవీపేట మండలం యంచ గుట్ట ప్రాంతంలో నాలుగు రోజుల క్రితం చిరుత సంచారాన్ని గ్రామస్తులు గుర్తించారు. అక్కడే తిరుగుతున్న ఆ చిరుతను చాలామంది గ్రామస్తులు చూశారు. దాని గాండ్రింపు విని పశువులు పరిగెత్తడం గమనించారు. దీంతో వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. అయితే ఎక్కడా ఎవరికీ ప్రమాదం లేకుండా చిరుత బోనులో చిక్కడం విశేషం. ఎవరినీ గాయపరచకముందే, పశువులపై దాడి చేయకముందే చిరుతను బంధించగలిగారు ఫారెస్ట్ అధికారులు.
హైదరాబాద్ జూ పార్క్ కి తరలింపు..
నాలుగు రోజులుగా ప్రజల్ని భయభ్రాంతులకు గురి చేసిన చిరుత ఈరోజు ఎట్టకేలకు బోనులో చిక్కింది. విఠలేశ్వర్ ఆలయం వద్ద బోను ఏర్పాటు చేయగా అందులో బందీ అయింది. దీంతో చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. సహజంగా ఇలా చిరుతలు బోనులో చిక్కితే వాటిని సుదూరంగా అటవీ ప్రాంతంలో వదిలిపెడతారు. కానీ తిరుమల ఘటన వారి ఆలోచనను మార్చింది. తిరుమలలో కూడా మొదటగా చిక్కిన చిరుతను అటవీ ప్రాంతంలో వదిలిపెట్టారు. ఆ తర్వాత కూడా చిరుత దాడి ఘటన జరగడంతో వరుసగా బంధించిన చిరుతలన్నిటినీ తిరుపతి జూ పార్క్ కి తరలించారు. ఇప్పుడు నిజామాబాద్ లో బోనులో చిక్కిన చిరుతను హైదరాబాద్ జూ పార్క్ కి తరలించారు అధికారులు.