తెలంగాణకు కూల్ న్యూస్.. నాలుగు రోజులు వర్ష సూచన
ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది.
ఎండ ధాటికి అల్లాడిపోతున్న తెలంగాణ ప్రజలకు చల్లటి వార్త. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రానికి వర్ష సూచన ఉందని వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతోపాటు ఈదురుగాలులతో కూడిన ఓ మోసారు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
ఆదిలాబాద్, కుమరం భీం, ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, వికారాబాద్, జగిత్యాల, కామారెడ్డి జిల్లాలకు వర్ష సూచన ఉందని ఐఎండీ ప్రకటించింది. ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ప్రకటించింది. సోమ, మంగళవారాల్లో ఈ జిల్లాలతోపాటు నిజామాబాద్, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మెదక్ జిల్లాల్లో కూడా వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఉరుములు, మెరుపులతోపాటు 40-50 కి.మీ. వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని పేర్కొంది.
మరోవైపు వడగాలులు
సాయంత్రానికి వర్షం కురిసే అవకాశాలున్నా పగలంతా వడగాలులు వీస్తాయని ఐఎండీ చెప్పింది. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అత్యవసరమైతే తప్ప బయటికి వెళ్లవద్దని సూచించింది.