కాంగ్రెస్‌లోకి పోచారం.. కేబినెట్‌ బెర్త్‌ కోసమేనా!

2014 కేసీఆర్‌ తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, 2018-23 మధ్య అసెంబ్లీ స్పీకర్‌గా పోచారానికి బాధ్యతలు అప్పగించారు. పోచారం చేరికపై కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.

Advertisement
Update:2024-06-21 13:51 IST

పార్లమెంట్‌ ఎన్నికలు ముగియడంతో ఆపరేషన్‌ ఆకర్ష్‌కు మళ్లీ తెరలేపింది కాంగ్రెస్ పార్టీ. ఇందులో భాగంగా మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డిని కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు సీఎం రేవంత్ రెడ్డి. స్వయంగా పోచారం ఇంటికి వెళ్లి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పారు. త్వరలో జరిగే కేబినెట్ విస్తరణలో పోచారం శ్రీనివాస్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వబోతున్నారని ప్రచారం జరుగుతోంది. 2023 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బాన్సువాడ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్‌ అభ్యర్థిగా విజయం సాధించారు పోచారం. కాంగ్రెస్ అభ్యర్థి ఏనుగు రవీందర్ రెడ్డిపై విజయం సాధించారు.



2011లో తెలంగాణ ఉద్యమానికి మద్దతుగా టీడీపీకి రాజీనామా చేసిన పోచారం.. ఆ తర్వాత జరిగిన ఉపఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2014, 2018, 2023అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున విజయం సాధించారు. పోచారంను ముద్దుగా లక్ష్మీపుత్రుడు అని పిలుచుకుంటారు కేసీఆర్. 2014 కేసీఆర్‌ తొలి ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా, 2018-23 మధ్య అసెంబ్లీ స్పీకర్‌గా పోచారానికి బాధ్యతలు అప్పగించారు. పోచారం చేరికపై కాంగ్రెస్ నేత ఏనుగు రవీందర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం.


అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరపున 39 మంది ఎమ్మెల్యేలు విజయం సాధించగా.. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు కారు దిగారు. స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. మరికొంత మంది నేతలు సైతం కారు దిగే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం నేతలకు కాంగ్రెస్‌ గాలం వేస్తున్నట్లు కొద్ది రోజులుగా ప్రచారం జరుగుతోంది. మరోవైపు పోచారం కాంగ్రెస్‌లో చేరుతున్నారన్న విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ శ్రేణులు ఆయన ఇంటి దగ్గర కొంత సేపు హంగామా సృష్టించారు. దీంతో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Tags:    
Advertisement

Similar News