సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కూనంనేని.. ఉత్కంఠ పోరులో విజయం..

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. పల్లా వెంకట రెడ్డిపై 15ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు.

Advertisement
Update:2022-09-08 12:16 IST

సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శిగా కొత్తగూడెం మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు ఎన్నికయ్యారు. పల్లా వెంకట రెడ్డి, కూనంనేని మధ్య హోరాహోరీ పోరు జరిగింది. జాతీయ పార్టీ నేతలు బుజ్జగించి ఏకగ్రీవానికి ప్రయత్నించినా ఇద్దరు నేతలు వెనక్కి తగ్గలేదు. చివరకు ఎన్నిక అనివార్యం కాగా.. రాత్రి పొద్దుపోయే వరకు ఎన్నికల ప్రక్రియ జరిగింది. తెలంగాణ స్టేట్ కౌన్సిల్ సభ్యులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. మొత్తం 110మంది ఓట్లు వేయగా.. అందులో 7 ఓట్లు చెల్లకుండా పోయాయి. కూనంనేని సాంబశివరావుకి 59 ఓట్లు రాగా, పల్లా వెంకట రెడ్డికి 44 ఓట్లు పోలయ్యాయి. దీంతో పల్లాపై 15 ఓట్ల మెజార్టీతో కూనంనేని గెలిచినట్టు ధృవీకరించారు.

చాడ వెంకట రెడ్డికి హ్యాట్రిక్ మిస్..

ఏపీ విభజన తర్వాత తెలంగాణకు రెండుసార్లు చాడ వెంకట రెడ్డి పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. పార్టీ నియమావళి ప్రకారం ఆయనకు మరోసారి అవకాశం ఉంది. ఆయన కూడా మూడోసారి కార్యదర్శిగా ఎన్నికయ్యేందుకు ఉత్సాహం చూపించారు. కానీ మాజీ ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అడ్డుపడ్డారు. ఈసారి తనకు అవకాశం ఇవ్వాలన్నారు. ఏకాభిప్రాయంకోసం పార్టీ పెద్దలు ప్రయత్నించినా కుదర్లేదు. దీంతో పోటీ అనివార్యమైంది.

పోటీనుంచి తప్పుకున్న చాడ..

ఏకగ్రీవంగా తనను ఎన్నుకుంటే సరే సరి, లేకపోతే పోటీలో నేను ఉండను అని తేల్చి చెప్పారు చాడ. దీంతో వ్యవహారం మరో మలుపు తిరిగింది. తాను పోటీలో ఉండను అంటూనే.. పల్లా వెంకట రెడ్డికి ఆయన మద్దతిచ్చారు, కూనంనేనిపై పోటీగా నిలబెట్టారు. దీంతో పోలింగ్ అనివార్యమైంది. పల్లా వెంకట రెడ్డి, కూనంనేని సాంబశివరావు రాష్ట్ర కార్యదర్శి పదవికోసం పోటీ పడ్డారు. ఈ పోటీలో చివరకు కూనంనేని విజేతగా నిలిచారు. పోటీనుంచి తప్పుకుని చాడ వెంకటరెడ్డి తన పరువు కాపాడుకున్నారు. అయితే ఆయన మద్దతుతో నిలబడిన పల్లా ఓటమిపాలయ్యారు. టీఆర్ఎస్ కి వామపక్షాలు మద్దతిస్తున్న వేళ, వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ, సీపీఎం కూడా తమ హవా చూపించే అవకాశముంది. ఈ దశలో కూనంనేని పట్టుబట్టి మరీ పార్టీపై పెత్తనం సంపాదించారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు.

Tags:    
Advertisement

Similar News