ఆ బీజేపీ నేత సైలెంట్‌ అయ్యారు ఎందుకో...?

చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల ముందు ఈమె బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు.

Advertisement
Update:2022-08-24 12:12 IST

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్‌ సొంత జిల్లా కరీంనగర్‌. ఇక్కడ ఫస్ట్‌ నుంచి ఆయన పట్టు కోసం ట్రై చేస్తున్నారు. గ్రూపుల రాజకీయంతో ఆయనకు ఇప్పటిదాకా పట్టు దొరకలేదు. కరీంనగర్‌ నియోజకవర్గం...ముఖ్యంగా టౌన్‌లో మాత్రమే ఆయనకు అనుచరులు ఉన్నారు. ఆ తర్వాత వేములవాడలో అంతో ఇంతో పట్టు ఉంది. బండి సంజయ్‌ అధ్యక్షుడైన తర్వాత ఉమ్మడి కరీంనగర్‌ జిల్లా నుంచి పెద్దగా పార్టీలోకి కీలక నేతలెవరూ రాలేదు. ఉన్న నేతలే ఇప్పుడు పార్టీ వీడే అవకాశం ఉందని తెలుస్తోంది. తాజాగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే బొడిగె శోభ పార్టీ మారుతారని ప్రచారం జరుగుతోంది. 2018 ఎన్నికల ముందు ఈమె బీజేపీలో చేరారు. బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత సంజయ్‌ వెంట నడిచారు. కానీ ఆయన పట్టించుకోకపోవడంతో తిరిగి సొంతగూటికి చేరాలనే ప్రయత్నాల్లో ఉన్నట్లు సమాచారం.

బొడిగె శోభ మొదట్లో ఎమ్మార్పీఎస్‌లో పనిచేశారు. 2001 నుంచి టీఆర్‌ఎస్‌లో తిరిగారు. జడ్పీటీసీ, చొప్పదండి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. అయితే నియోజకవర్గంలో ఇతర నేతల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం కావడంతో ఆమెకు టికెట్‌ దక్కలేదు. దీంతో ఆమె ఎన్నికల ముందు బీజేపీలో చేరారు. అయితే అక్కడ ఆమె ఇమ‌డ‌లేక‌పోతుంద‌నే ప్రచారం జరుగుతోంది. తాను మొదటి నుంచి తిరిగిన బాట ఒక్కటైతే....బీజేపీది పూర్తిగా వ్యతిరేక బాట కావడంతో ఆమె అక్కడ ఉండలేకపోతారని తెలుస్తోంది. దీంతో ఆమె తిరిగి టీఆర్‌ఎస్‌ నేత‌ల‌ ట‌చ్‌లోకి వెళ్లార‌ని తెలుస్తోంది. ఆమె త్వరలోనే పార్టీ మారే అవకాశం ఉందనేది నియోజకవర్గంలో టాక్‌.

Tags:    
Advertisement

Similar News